Chiranjeevi: 'శంకర్ దాదా ఎంబీబీఎస్'లో కుర్చీలో కూర్చున్న బాలుడే నేటి 'ఉప్పెన' హీరో... గర్వంగా ఉందన్న చిరంజీవి!

Chiranjeevi Comments on Uppena Hero Vaishnav Tej
  • హైదరాబాద్ లో 'ఉప్పెన' ప్రీ రిలీజ్ ఈవెంట్
  • 12న విడుదల కానున్న చిత్రం
  • ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి
ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు దర్శకత్వంలో, చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన 'ఉప్పెన' సినిమా, ఈ నెల 12న వెండితెరపైకి రానున్న నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్లో జరిగింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొని, ఆసక్తికర ఘటనలను గురించి గుర్తు చేసుకున్నారు.

ఈ సినిమాలో హీరోగా కనిపించిన వైష్ణవ్ తేజ్, గతంలోనే బాల నటుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. తాను నటించిన 'శంకర్ దాదా ఎంబీబీఎస్' చిత్రంలో గతాన్ని మరచిపోయి, కుర్చీలో కూర్చున్న బాలుడి పాత్రలో వైష్ణవ్ అద్భుతంగా నటించి, తనలోనూ ఓ హీరో ఉన్నాడని సంవత్సరాల క్రితమే చెప్పకనే చెప్పాడని కొనియాడారు. ఇక సుకుమార్, తన శిష్యుడు బుచ్చిబాబుతో వచ్చి, ఈ కథను తనకు చెప్పాడని, అప్పుడే ఇంత అద్భుతమైన స్టోరీ, ఇంతవరకూ ఎవరికీ ఎందుకు తట్టలేదా? అని అనిపిందని అన్నారు.

'ఉప్పెన' మరో 'రంగస్థలం' కాబోతున్నదని తనకు నమ్మకంగా తెలుసునని, బుచ్చిబాబు దర్శకత్వాన్ని చూస్తుంటే భారతీరాజా గుర్తుకు వచ్చారని, ప్రేక్షకులతో పాటు సినిమా ఇండస్ట్రీ పెద్దలు, ప్రతినిధులు, ప్రతిఒక్కరూ చూడాల్సిన చిత్రమని అన్నారు. సినిమాలో తన పాత్ర గొప్పదనాన్ని గుర్తించి నటించేందుకు అంగీకరించిన విజయ్ సేతుపతిపై చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. తమిళ సినీ పరిశ్రమలో ఎంతో పేరున్నా, చేస్తున్న పాత్రలకు మాత్రమే ప్రాధాన్యతను ఇస్తూ సాగుతున్నాడని కొనియాడారు. ఆయన నటించేందుకు అంగీకరించడమే సినిమా తొలి విజయానికి సంకేతమని చెప్పారు.

ఈ సినిమాకు నిర్మాతలుగా ఉన్న మైత్రీ మూవీ మేకర్స్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని, వారి బ్యానర్ లో తాను ఓ చిత్రాన్ని చేయబోతున్నానని మెగాస్టార్ వ్యాఖ్యానించారు. తెలుగు సినీ పరిశ్రమలోని పెద్ద హీరోలంతా వారి బ్యానర్ లో చేయాలని భావిస్తున్నారని అన్నారు.

దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ, తాను చిరంజీవి నటించిన 'ఘరానా మొగుడు' సినిమాను చూసేందుకు 75 రోజులు వేచి చూశానని, కానీ ఆ కుటుంబంలోని హీరోతో సినిమాను చేసేందుకు నాలుగు గంటల్లోనే అవకాశం లభించిందని అన్నారు. కథ వినగానే, వైష్ణవ్ తో సినిమా చేసేందుకు చిరంజీవి అంగీకరించారని తెలిపారు. వైష్ణవ్ తేజ్, పవన్ కల్యాణ్ అంత పెద్ద హీరో అవుతాడనడంలో సందేహం లేదన్నారు.

Chiranjeevi
Uppena
Pre Release Event
Vaishnav Tej
Buchchibabu

More Telugu News