USA: ట్రంప్ ను ఏకాకిని చేసేందుకు బైడెన్ మరో ఎత్తు!

Biden Says No Need to Share Inteligence Reports to Trump

  • ఇంటెలిజెన్స్ నివేదికలు ఆయనకు ఎందుకు?
  • అమెరికా ప్రమాదంలో పడుతుంది
  • యూఎస్ లో మాజీ అధ్యక్షులకు నిఘా సమాచారం
  • ట్రంప్ కు తెలియపరచక్కర్లేదన్న బైడెన్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను పూర్తిగా నిలువరించేలా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మరో ఎత్తు వేశారు. గూఢచార సమాచార నివేదికలు (క్లాసిఫైడ్ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్స్) ఆయనతో పంచుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. వాస్తవానికి ఇంటెలిజెన్స్ ఇచ్చే నివేదికలను మాజీ అధ్యక్షులకు కూడా అందించాలన్న సంప్రదాయం అమెరికాలో అమలవుతోంది. అయితే, ట్రంప్ కు ఇలాంటి నివేదికల అవసరం ఏముందని వ్యాఖ్యానించిన బైడెన్, ఈ బ్రీఫింగుల వల్ల ప్రయోజనం ఏంటని, వీటి ప్రభావం ఆయనపై ఉందా? అని అడిగారు.

ఈ విషయాలు ఆయనకు తెలిస్తే, నోరు జారి ఏదైనా మాట్లాడతారని, దానివల్ల ఇబ్బందులు తప్ప, ప్రయోజనం ఉంటుందని తాను అనుకోవడం లేదని స్పష్టం చేశారు. క్యాపిటల్ హౌస్ పై నిరసనకారులను రెచ్చగొట్టడంతో పాటు, ఐదుగురి మరణానికి కూడా ఆయన కారణమయ్యారని జో బైడెన్ వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే, ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్స్ తనకు కూడా తెలియపరచాలని ట్రంప్ కోరారా? అన్న విషయమై స్పష్టత లేదు.

కాగా, సీబీఎస్ కు జో బైడెన్ ఇటీవల ఇంటర్వ్యూ ఇస్తూ, ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి ఇంటర్వ్యూ నేడు ప్రసారం కానుంది. ఇక అమెరికాకు మాజీ అధ్యక్షులైన జిమ్మీ కార్టర్, జార్జ్ బుష్, బరాక్ ఒబామా తదితరులు ఇప్పటికీ రెగ్యులర్ గా ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్స్ స్వీకరిస్తూనే ఉండటం గమనార్హం.

ఇదే సమయంలో తాను వైట్ హౌస్ లో ఉన్న సమయంలో నిఘా వర్గాల నివేదికలపై ఆయన ఇంటెలిజెన్స్ బ్రీఫింగుల పట్ల ట్రంప్ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారని వ్యాఖ్యానించిన బైడెన్, 2017 నాటి ఉదంతాన్ని గుర్తు చేశారు. రష్యా విదేశాంగ శాఖ మంత్రితోను, ఆ దేశ రాయబారితోను జరిపిన సమావేశంలో ట్రంప్, అమెరికాకు చెందిన రహస్య సమాచారాన్ని పంచుకున్నాడని గతంలో వార్తలు వచ్చాయని అన్నారు.

2016 లో జరిగిన ప్రెసిడెంట్ ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందన్న ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారంపై ట్రంప్ బహిరంగ వ్యాఖ్యలు చేశారని, ఆయన్ను ప్రతినిధుల సభ ఇప్పటికే అభిశంసించిన నేపథ్యంలో, సెనేట్ లో వచ్ఛేవారం  విచారణ జరుగనుండగా, ఆయనకు ఈ నిఘా సమాచారం తెలియజేయడం ఎందుకని ప్రశ్నించారు. ట్రంప్ నోటి దురుసుతనంతో అమెరికా జాతి భద్రత ప్రమాదంలో పడవచ్చని బైడెన్ వర్గం వ్యాఖ్యానించింది.


  • Loading...

More Telugu News