Branded Meet: ఇక మార్కెట్లో తెలంగాణ బ్రాండ్ మాంసం!
- బ్రాండెడ్ మాంసం గురించి మంత్రి తలసాని స్పందన
- నాణ్యతతో కూడిన మాంసం అందిస్తామని వెల్లడి
- ధరలు అందుబాటులోనే ఉంటాయని వివరణ
- పశు సంతతిని మరింత వృద్ధి చేస్తామని స్పష్టీకరణ
తెలంగాణ ప్రభుత్వం సరికొత్త మార్కెటింగ్ మార్గాలను అన్వేషిస్తోంది. అందుకే త్వరలోనే తెలంగాణ బ్రాండ్ పేరుతో మాంసం విక్రయాలకు ప్రయత్నాలు చేస్తోంది. దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, త్వరలోనే మార్కెట్లో తెలంగాణ బ్రాండ్ పేరుతో మాంసం విక్రయాలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. వినియోగదారులకు నాణ్యతతో కూడిన మాంసం అందిస్తామని, అదే సమయంలో ధరలు కూడా అందరికీ అందుబాటులోనే ఉంటాయని వివరించారు.
మంత్రి తలసాని ఇవాళ తన కార్యాలయంలో పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్రాండెడ్ మాంసం గురించి తెలిపారు. పశు సంతతిని మరింత వృద్ధి చేసే దిశగా అనేక చర్యలు తీసుకుంటూ తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తోందని అన్నారు. సంప్రదాయ వృత్తులతో పాటుగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన ఒకే ఒక్క నాయకుడు సీఎం కేసీఆర్ అని తలసాని ఉద్ఘాటించారు.