Pfizer: భారత్ లో కరోనా వ్యాక్సిన్ వినియోగం దరఖాస్తును వెనక్కి తీసుకున్న ఫైజర్

US Company Pfizer withdraws application for corona vaccine usage in India

  • భారత్ లో అందరికంటే ముందు దరఖాస్తు చేసిన ఫైజర్
  • కొవిషీల్డ్, కొవాగ్జిన్ ల వైపు మొగ్గుచూపిన కేంద్రం
  • బరి నుంచి తప్పుకోవాలని ఫైజర్ నిర్ణయం
  • డీసీజీఐతో సమావేశం అనంతరం దరఖాస్తు వాపసు

అమెరికా ఔషధ సంస్థ ఫైజర్ భారత్ లో తమ కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి చేసుకున్న దరఖాస్తును ఉపసంహరించుకుంది. జర్మనీకి చెందిన బయో ఎన్ టెక్ సంస్థతో కలిసి ఫైజర్ కరోనా వ్యాక్సిన్ రూపొందించింది. భారత్ లో అత్యవసర వినియోగానికి మొట్టమొదట దరఖాస్తు చేసుకున్న సంస్థ ఫైజరే. అయితే, ఇటీవల భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ)తో సమావేశం జరిగిన తర్వాత ఫైజర్ తమ దరఖాస్తును వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. ఆ మేరకు నేడు ప్రకటన చేసింది.

వ్యాక్సిన్ అనుమతుల విషయంలో డీసీజీఐ అదనపు సమాచారం కోరే అవకాశాలు కనిపిస్తున్నాయని, అందుకే ప్రస్తుతానికి దరఖాస్తును ఉపసంహరించుకుంటున్నామని ఫైజర్ వర్గాలు తెలిపాయి. అయితే సమీప భవిష్యత్తులో తాము మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశాలు లేకపోలేదని, డీసీజీఐతో సంప్రదింపులు కొనసాగుతాయని వెల్లడించాయి.

ఫైజర్ సంస్థ గతేడాదే వ్యాక్సిన్ వినియోగం కోసం దరఖాస్తు చేసుకోగా, తక్కువ ధరకే డోసులు అందిస్తున్న ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా (కొవిషీల్డ్), దేశీయంగా తయారైన కొవాగ్జిన్ (భారత్ బయోటెక్-ఐసీఎంఆర్) ల వైపు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపింది. స్థానికంగా కొద్దిసంఖ్యలోనైనా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించకుండా అనుమతులు ఇవ్వలేమని డీసీజీఐ ఫైజర్ కు తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. అందుకే ఫైజర్ తన దరఖాస్తును వాపసు తీసుకున్నట్టు అర్థమవుతోంది.

  • Loading...

More Telugu News