Iran: పాకిస్థాన్ భూభాగంలో సర్జికల్ స్ట్రయిక్స్ చేశాం: ఇరాన్ ప్రకటన
- ఇరాన్ జవాన్లను అపహరించిన పాక్ ఉగ్ర సంస్థ
- లక్షిత దాడి చేసిన ఇరాన్
- జైష్ ఉల్ అదల్ స్థావరాలపై దాడి
పాకిస్థాన్ పరిధిలోకి వెళ్లిన తమ ఆర్మీ, అక్కడ సర్జికల్ స్ట్రయిక్స్ చేసిందని ఇరాన్ ఎలైట్ రివల్యూషనరీ గార్డ్స్ సంచలన ప్రకటన చేసింది. బెలూచిస్థాన్ లోకి జొరబడిన తమ జవాన్లు జైష్ ఉల్ అదల్ అనే టెర్రరిస్ట్ గ్రూప్ చెరలో ఉన్న తమ సరిహద్దు రక్షక దళం సభ్యులను విజయవంతంగా విడిపించిందని పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేస్తూ, వాహాబీ ఉగ్ర సంస్థగా చెలామణిలో ఉన్న జైష్ ఉల్ అదల్, 2018, అక్టోబర్ 16న 12 మంది ఇరాన్ గార్డులను అపహరించిందని గుర్తు చేసింది.
వారిని సురక్షితంగా విడిపించేందుకు రెండు దేశాల సైన్యాధికారులతో సంయుక్త కమిటీని ఏర్పాటు చేశామని, చర్చల ద్వారా ఫలితం రాకపోవడంతో, మిలటరీ ఆపరేషన్ల ద్వారా ఇప్పటివరకూ 10 మందిని కాపాడామని, మిగిలిన ఇద్దరినీ తాజాగా జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ తో కాపాడామని ఇరాన్ పేర్కొంది. కాగా, ఇరాన్ లో నివాసం ఉంటున్న బెలూచ్ సున్నీల హక్కులను కాపాడేందుకు తాము పోరాటం సాగిస్తున్నామని చెప్పుకునే జైష్ ఉల్ అదల్, ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేస్తోంది.