Yoshiro Mori: 'అతి'వలపై నోరు జారి... సారీ చెప్పిన జపాన్ మాజీ ప్రధాని

Tokyo Olympics Chief Yoshiro Mori apologies for his comments on women

  • వివాదంలో టోక్యో ఒలింపిక్ క్రీడల కమిటీ చీఫ్ 
  • కమిటీలో ఉన్న మహిళలు అతిగా మాట్లాడుతుంటారని వ్యాఖ్యలు
  • వారు సమయం తినేస్తుంటారని వెల్లడి
  • నెటిజన్ల ఆగ్రహంతో తప్పును ఒప్పుకున్న వైనం

జపాన్ మాజీ ప్రధాని, టోక్యో ఒలింపిక్ క్రీడల కమిటీ చీఫ్ యోషిరో మోరి ఓ వివాదంలో చిక్కుకున్నారు. కరోనా కారణంగా టోక్యో ఒలింపిక్ క్రీడల నిర్వహణ గత ఏడాది కాలంగా వాయిదా పడుతోంది. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించేందుకు టోక్యో ఒలింపిక్స్ కమిటీ యోషిరో మోరి నాయకత్వంలో పలుమార్లు సమావేశమైంది. ఈ కమిటీలో మొత్తం 24 మంది సభ్యులుండగా, వారిలో ఆరుగురు మహిళలు.

ఈ కమిటీలో మహిళల ప్రాతినిధ్యాన్ని మరింత పెంచాలని గతంలో నిర్ణయించగా, ఆ అంశంపై తాజాగా మాట్లాడుతూ యోషిరో మోరి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మహిళలు అతిగా వాగుతుంటారని, అలాంటివాళ్లను బోర్డు డైరెక్టర్లుగా నియమిస్తే గంటల కొద్దీ మాట్లాడుతూ సమయం మొత్తం తినేస్తుంటారని వ్యాఖ్యానించారు. అందుకే, కమిటీలో మహిళల సంఖ్యను పెంచితే వారు మాట్లాడే సమయాన్ని తగ్గించాలని అన్నారు. తమ ప్రసంగాన్ని వెంటనే ముగించడం మహిళలకు చాలా కష్టసాధ్యమైన విషయం అని, ఇది ఎంతో చిరాకు పుట్టిస్తుందని సెలవిచ్చారు.

దాంతో యోషిరోపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. మహిళలను కించపరిచేలా ఇంత దారుణంగా మాట్లాడతారా అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ ప్రారంభమైంది. నెటిజన్ల సెగ తట్టుకోలేని యోషిరో మోరీ వెంటనే క్షమాపణలు చెప్పి పరిస్థితి మరింత ముదరకుండా చూశారు.

  • Loading...

More Telugu News