HAL: శత్రు లక్ష్యాలపై ‘దేశీ కన్ను’: ఇన్ఫినిటీ డ్రోన్ ను అభివృద్ధి చేస్తున్న హాల్

New Indian Drone Can Soar For 90 Days Coordinate Attacks

  • మూడు నుంచి ఐదేళ్లలో సైన్యంలోకి 
  • 65 వేల అడుగుల ఎత్తులో.. 90 రోజుల పాటు నిరంతర సేవలు
  • విపత్తు సహాయ చర్యల్లోనూ వినియోగం
  • సహజ వనరుల నిర్వహణకూ సాయం
  • జల మార్గాల పర్యవేక్షణకూ తోడ్పాటు

శత్రుసేనలపై ఓ కన్నేసి ఉంచే దేశీయ డ్రోన్ శరవేగంగా సిద్ధమైపోతోంది. 65 వేల అడుగుల ఎత్తులో.. 90 రోజులు ఏకధాటిగా ఎగిరే సత్తా ఉన్న ‘ఇన్ఫినిటీ’ డ్రోన్ మరో మూడు నుంచి ఐదేళ్లలో సైన్యానికి అందుబాటులోకి రానుంది. కంబాట్ ఎయిర్ టీమింగ్ సిస్టమ్ (వాయు బృంద పోరాట వ్యవస్థ– క్యాట్స్) ప్రోగ్రామ్ లో భాగంగా హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్).. ఇన్ఫినిటీని అభివృద్ధి చేస్తోంది. బెంగళూరులోని న్యూ స్పేస్ అనే స్టార్టప్ తో జట్టు కట్టి దానిని రూపొందిస్తోంది.

తనకు తానే సాటి అనిపించుకునే సింథటిక్ ఆపర్చర్ రాడార్ ను ఇన్ఫినిటీ కలిగి ఉంటుంది. శత్రు భూభాగంలోని లక్ష్యాలను ఎంత దూరంలో ఉన్నా గుర్తించి.. దాడి చేసే భారత డ్రోన్ వ్యవస్థలకు సమాచారాన్ని చేరవేస్తుంది. ఇప్పటికే క్యాట్స్ లో వారియర్ ‘లోయల్ వింగ్ మ్యాన్’, ఆల్ఫా ఎస్ స్వార్మ్ డ్రోన్లు/ హంటర్ క్షిపణులు చేరాయి.

వాటికి ఆ సమాచారాన్ని ఇన్ఫినిటీ పంపిస్తుంది. అంతేగాకుండా, దాడి చేసే డ్రోన్ల ద్వారా దాడి దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం కూడా చేస్తుంది. క్షేత్ర స్థాయిలో ఉన్న దాడి పర్యవేక్షణా కేంద్రాలకు ఆ వీడియోను పంపిస్తుంది. దీని ద్వారా అనుకున్న మిషన్ విజయవంతమైందా? కాలేదా? అన్న సమాచారాన్ని సులువుగా తెలుసుకునేందుకు వీలవుతుంది.

ఒక్క మిలటరీ చర్యల కోసమే కాకుండా.. విపత్తుల్లో సహాయ చర్యలు చేసేందుకు, స్మార్ట్ సిటీలు, సహజ వనరుల నిర్వహణకూ ఇన్ఫినిటీని వాడుకోవచ్చని హాల్ చెబుతోంది. విపత్తు నిర్వహణ చర్యల కోసం హోం శాఖ దీనిని వాడుకోవచ్చని, తీర ప్రాంతాల్లోని జల మార్గాలను ఓడరేవుల మంత్రిత్వ శాఖ పర్యవేక్షించొచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఎయిర్ బస్ అభివృద్ధి చేసిన సోలార్ ఎలక్ట్రిక్ స్ట్రాటో ఆవరణ డ్రోన్ జెఫైర్ తరగతిలోనిదే ఇన్ఫినిటీ డ్రోన్ అని చెబుతున్నారు. జెఫైర్ దాదాపు 70 వేల అడుగుల ఎత్తులో.. కొన్ని నెలల పాటు సేవలందిస్తుందని సమాచారం. దానికి దీటుగా ఇన్ఫినిటీ కూడా పనిచేస్తుందని హాల్ నిపుణులు చెబుతున్నారు. దీని అభివృద్ధికి ప్రస్తుతం హాల్ అంతర్గతంగానే నిధులు సమకూరుస్తోందని చెబుతున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News