DNA: డీఎన్​ఏ బిల్లుతో కొందరినే లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉంది: పార్లమెంటరీ కమిటీ నివేదిక

House panel advises govt to tread cautiously on DNA Bill

  • జాగ్రత్తగా రూపొందించాలని సూచన
  • ప్రతిదశలోనూ పక్షపాతం లేకుండా దర్యాప్తు సాగాలని స్పష్టీకరణ
  • బిల్లుపై సందేహాలను నివృత్తి చేయాలని సూచన
  • బిల్లులోని అంశాలను వ్యతిరేకించిన అసదుద్దీన్, సీపీఐ ఎంపీ

డీఎన్ఏ బిల్లును జాగ్రత్తగా రూపొందించాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటరీ కమిటీ సూచించింది. నేరస్థులు, అనుమానితుల గుర్తింపు, తప్పిపోయిన వారి ఆచూకీని కనిపెట్టేందుకు, గుర్తు తెలియని మృతదేహల గుర్తింపునకు ఉద్దేశించిన డీఎన్ఏ సాంకేతికత (వినియోగం, విధివిధానాల) నియంత్రణ బిల్లుపై కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు జై రాం రమేశ్ నేతృత్వంలోని కమిటీ నివేదికను సిద్ధం చేసింది. ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కొందరు ఎంపీలు బిల్లును వ్యతిరేకిస్తున్నారని, కొన్ని వర్గాలనే లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందంటూ అభ్యంతరం తెలిపారని నివేదికలో పేర్కొంది.  

కేసు విచారణలోని ప్రతి దశలోనూ పక్షపాతం లేకుండా అధికారులు స్వతంత్ర దర్యాప్తు చేసేలా చూడాలని నివేదికలో సూచించింది. బిల్లుపై ఉన్న సందేహాలను ఇటు పార్లమెంట్ లోనూ, అటు ప్రజల్లోనూ నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. జన్యు నమూనాల సేకరణ ఎంత పక్కాగా జరుగుతుందో వివరించాలని చెప్పింది.

డీఎన్ఏ బిల్లు ద్వారా ఎవరినీ బలవంతంగా కేసుల్లో ఇరికించరాదని పేర్కొంది. న్యాయ వ్యవస్థలో సాంకేతికతకూ పరిమితులున్నాయని, కాబట్టి కేసుల పరిష్కారానికి డీఎన్ఏ బిల్లును ఎప్పుడు వాడాలి? ఎప్పుడు వాడకూడదు? అన్న దానిపై నిర్ధిష్టమైన ప్రమాణాలు ఉండాలని తెలిపింది. దీనిపై అందరికీ శిక్షణనివ్వాలని సూచించింది.

2019లో ప్రవేశపెట్టిన ఈ బిల్లును స్టాండింగ్ కమిటీ పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం పంపించింది. కమిటీలో సభ్యులైన మజ్లిస్ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, రాజ్యసభ సభ్యుడు, సీపీఐ నేత బినోయ్ విశ్వంలు బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.  వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందని, కొన్ని వర్గాలనే లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కమిటీ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది.

  • Loading...

More Telugu News