Priyanka Gandhi: పరస్పరం ఢీ కొన్న ప్రియాంకా గాంధీ కాన్వాయ్‌లోని వాహనాలు
![Priyanka Gandhi cavalcade collide on UP](https://imgd.ap7am.com/thumbnail/cr-tn-180dabfaa55a.jpg)
- ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ వెళుతుండగా ఘటన
- ఎవరికీ గాయాలు కాలేదని కాంగ్రెస్ వర్గాల వెల్లడి
- రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంక
ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి ఒక్కసారిగా కాన్వాయ్‌లోని వాహనాలు పరస్పరం ఢీ కొన్నాయి. ఈ ఘటన నుంచి అందరూ సురక్షితంగా బయటపడ్డారని, ప్రియాంక గాంధీ సహా ఎవరికీ గాయాలు కాలేదని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
గత నెల 26న రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో మృతి చెందిన నవ్రీత్ సింగ్ అనే రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రియాంకా గాంధీ ఉత్తరప్రదేశ్ లోని రాంపుర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వివరించారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేపట్టిన ర్యాలీలో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కి చెందిన నవ్రీత్ సింగ్ (24) ట్రాక్టర్ నడుపుతుండగా అది పల్టీ కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పోలీసుల కాల్పుల వల్లే అతను చనిపోయాడని కొందరు ఆరోపణలు కూడా చేశారు.