bse: రికార్డు స్థాయిలో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్!
- బడ్జెట్ తరువాత కొనసాగుతున్న ర్యాలీ
- మరోసారి 50 వేల పాయింట్లు దాటిన సెన్సెక్స్
- దాదాపు ఒక శాతం లాభంలో సూచికలు
భారత స్టాక్ మార్కెట్ సరికొత్త రికార్డు స్థాయికి చేరుకుంది. బడ్జెట్ నాడు 2 వేల పాయింట్లకు పైగా, ఆపై మంగళవారం నాడు 1000 పాయింట్లకు పైగా పెరిగిన బెంచ్ మార్క్ సూచిక సెన్సెక్స్, ఈ ఉదయం మరిన్ని లాభాలను పండించుకుంది. మరోసారి 50 వేల పాయింట్ల స్థాయిని అధిగమించి దూసుకెళుతోంది. ఈ ఉదయం 10.15 గంటల సమయంలో బీఎస్ఈ సెన్స్ సూచిక క్రితం ముగింపుతో పోలిస్తే 381 పాయింట్లు పెరిగి 50,178 పాయింట్లకు చేరుకుంది.
ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచిక, 130 పాయింట్లు పెరిగి 14,778 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. సెషన్ ఆరంభంలో కొంత మేరకు లాభాల స్వీకరణ కనిపించినా, ఆ వెంటనే నిమిషాల వ్యవధిలోనే సూచికలు లాభాల్లోకి నడిచాయి. సెన్సెక్స్ లో మారుతి సుజుకి, కోటక్ బ్యాంక్, ఎస్బీఐ, ఐటీసీ, ఆసియన్ పెయింట్స్, రిలయన్స్ ఈక్విటీలు 0.23 నుంచి ఒకటిన్నర శాతం నష్టపోగా, మిగతా కంపెనీలన్నీ 10 శాతం వరకూ లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఇక ప్రపంచ మార్కెట్ల విషయానికి వస్తే, మంగళవారం నాడు యూఎస్ మార్కెట్ 1.56 శాతం పెరిగింది. నేటి ఆసియా మార్కెట్లలో నిక్కీ 0.76 శాతం, స్ట్రెయిట్స్ టైమ్స్ 0.59 శాతం, తైవాన్ వెయిటెన్డ్ 0.42 శాతం, కోస్పి 0.69 శాతం, సెట్ కాంపోజిట్ 0.72 శాతం, జకార్తా కాంపోజిట్ 1.32 శాతం, షాంగై కాంపోజిట్ 6.97 శాతం లాభపడ్డాయి. ఇదే సమయంలో హాంగ్ సెంగ్ మాత్రం 0.47 శాతం నష్టపోయింది.