Sujana Chowdary: పట్టాభిపై గూండాల దాడి గర్హనీయం: సుజనా చౌదరి

Sujana Chowdary condemns attack on Pattabhi

  • రాష్ట్రంలో నెలకొన్న భయానక పరిస్థితికి ఇది నిదర్శనం
  • దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి
  • వైసీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తోంది

తెలుగుదేశం పార్టీ నేత పట్టాభిపై విజయవాడలోని ఆయన నివాసం వద్ద దాడి జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆయనపై రాడ్లు, కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ నేపథ్యంలో ధ్వంసమైన కారుతో పాటు తాడేపల్లిలోని జగన్ ఇంటికి పట్టాభితో పాటు పలువురు టీడీపీ నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు బయల్దేరబోగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. పట్టాభిని బలవంతంగా పోలీసు వాహనంలో ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు ఈ ఘటనపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మండిపడ్డారు. టీడీపీ నేత పట్టాభిపై గూండాల దాడి గర్హనీయమని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న భయానక పరిస్థితికి, దిగజారిన శాంతిభద్రతలకు ఈ దాడి నిదర్శనమని చెప్పారు. ఈ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికలు జరుగుతున్న ఈ సమయంలో విపక్ష నేతలకు పోలీసులు తగిన భద్రతను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

వైసీపీ ప్రభుత్వంపై కూడా సుజనా చౌదరి విమర్శలు గుప్పించారు. ప్రత్యేక ప్యాకేజీలో ఏపీకి ప్రకటించిన రూ. 20 వేల కోట్లను తీసుకురావడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. ఢిల్లీలో సొంత పనులను చక్కపెట్టుకోవడంపై తప్ప రాజ్యాంగపరంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులను తెచ్చుకోవడంపై దృష్టి పెట్టడం లేదని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తోందని... ఇది రాష్ట్రానికి పెను భారంగా పరిణమిస్తుందని అన్నారు. అంతులేని అప్పులు భవిష్యత్ తరాలకు ఇబ్బందికరంగా మారుతాయని చెప్పారు.

Sujana Chowdary
BJP
Pattabhi
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News