Bonda Uma: అందుకే వైసీపీ అరెస్టులు చేయిస్తోంది: బోండా ఉమ, జవహర్ ఆగ్రహం
- ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ నేతల అరెస్టులు
- పోలీసుల తీరు వైసీపీ నేతల్లా ఉంది
- నిమ్మగడ్డ రమేశ్ కుమార్ జోక్యం చేసుకోవాలి
- విచారణ లేకుండా అరెస్టు చేయడం ఏంటి?
టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. పోలీసుల తీరు వైసీపీ నేతల్లా ఉందని, ఈ అక్రమ అరెస్టులపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ జోక్యం చేసుకోవాలని ఆయన అన్నారు.
తమ పార్టీ నేతలు బయట ఉంటే వైసీపీ నేతల ఆటలు సాగవని ముందస్తుగా అరెస్టులు చేయిస్తున్నారని ఆయన చెప్పారు. వైసీపీ నేతలు పాల్పడుతోన్న అరాచకాలను మాత్రం పోలీసులు పట్టించుకోవట్లేదని ఆయన అన్నారు. కోర్టు మొట్టికాయలు వేస్తున్నప్పటికీ పోలీసుల తీరు మారట్లేదని చెప్పారు.
ఏపీ మాజీ మంత్రి జవహర్ ఈ ఘటనపై మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో టీడీపీ నేతలను వైసీపీ ప్రభుత్వం జైల్లో పెట్టి రాజకీయం చేయాలనుకుంటోందని ఆరోపించారు. ఈ తీరుని కొనసాగిస్తూ స్థానిక ఎన్నికల్లోకి వెళ్లాలని చూస్తోందని, ఓటమి భయంతోనే వైసీపీ ఈ విధంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. అచ్చెన్నాయుడుపై విచారణ లేకుండా అరెస్టు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇలా అరెస్టులు చేసినంత మాత్రాన తాము భయపడబోమని తెలిపారు.