India: నరేంద్ర మోదీ కల నెరవేర్చే దిశగా.. కేంద్ర బడ్జెట్!
- ఇండియాను 5 ట్రిలియన్ ఎకానమీగా మార్చుతామన్న మోదీ
- ఆర్థిక వ్యవస్థ పరిధిని పెంచేందుకు సహకరించేలా బడ్జెట్
- దీర్ఘకాలంలో ఇండియాకు మేలు కలుగుతుందన్న నిపుణులు
- పన్నులు పెంచడం కూడా మంచిదేనన్న అభిప్రాయం
మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో ప్రజలకు వాటాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణ, విదేశీ పెట్టుబడులను మరింతగా ఆహ్వానించేలా తీసుకున్న నిర్ణయాలు... వెరసి ఇండియాను 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చాలన్న ప్రధాని నరేంద్ర మోదీ కలను నెరవేర్చే దిశగా బడ్జెట్ ప్రతిపాదనలు సాగాయని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు.
2021-22 ఆర్థిక సంవత్సరానికి పార్లమెంట్ ముందుకు వచ్చిన బడ్జెట్, మరింత ఆర్థిక వృద్ధి, వ్యవస్థ పరిధిని పెంచేందుకు సహకరిస్తుందని, దీర్ఘకాలంలోనూ ఈ నిర్ణయాలు వ్యవస్థకు మేలును కలిగిస్తాయని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
గత సంవత్సరం నెలకొన్న పరిస్థితుల కారణంగా ఆర్థిక వ్యవస్థ గాడి తప్పగా, ఆ కారణం చేతనే పన్నులను పెంచడంతో పాటు మూలధన వ్యయాన్ని తగ్గించే దిశగా ఆర్థిక మంత్రి అడుగులు వేశారని, ఇది ఇండియాకు మేలు కలిగిస్తుందని అంటున్నారు. అభివృద్ధి బాటను వదిలివేసేందుకు భారత ప్రభుత్వం ఎంతమాత్రమూ అంగీకరించే స్థితిలో లేదని, ఆ కారణంతోనే 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధించేలా ఆర్థిక వ్యవస్థను ముందడుగు వేయించేందుకే నిర్ణయించుకున్నందునే, కొంత పన్నుల భారం ప్రజలపై వేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
ఇక, తన ప్రసంగంలో ఈ బడ్జెట్ ను ఆరు మూలస్తంభాలపై నిలిపానని నిర్మలా సీతారామన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆరోగ్య రంగం, ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్ కాపిటల్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, సమ్మిళిత అభివృద్ధి, మానవ మూలధన పునరుద్ధరణ, పరిశోధన, అభివృద్ధి విభాగంలో వినూత్న ఆవిష్కరణలు, గరిష్ఠ పాలన అంశాలపై దృష్టిని సారించినట్టు వెల్లడించారు.
కరోనా కారణంగా ఏర్పడ్డ పరిస్థితులు ప్రభుత్వానికి సవాళ్లు విసురుతున్న వేళ, ఇప్పటికే కనిష్ఠానికి పతనమైన జీడీపీ వృద్ధిని సాధ్యమైనంతగా పెంచేందుకు తన ప్రతిపాదనలు ఉపకరిస్తాయని కూడా ఆమె తెలిపారు. ఆర్థిక వ్యవస్థ మరింతగా కుంగిపోకుండా తీసుకోవాల్సిన అన్ని నిర్ణయాలనూ తీసుకుంటున్నామని కూడా తెలిపారు.
"జీడీపీని తిరిగి పెంచేందుకు మా ప్రభుత్వం పూర్తి కృతనిశ్చయంతో ఉందని నేను నమ్మకంగా చెప్పగలను. అందుకు కావాల్సిన మద్దతిస్తాం. ఈ బడ్జెట్ వ్యవస్థను తిరిగి నిలిపేందుకు అవసరమైన అన్ని అవకాశాలనూ అందిస్తుంది" అని ఆమె అన్నారు.
కాగా, మార్కెట్ పండితులు, బ్రోకరేజ్ సంస్థలు, అనలిస్టులు ఈ బడ్జెట్ పై సానుకూల స్పందన వెలువరించారు. అత్యధికులు సమీప భవిష్యత్తులో ఇండియా మరింత బలంగా మారేందుకు అవసరమైన నిర్ణయాలు వెలువడ్డాయని అంచనా వేయడం గమనార్హం. ప్రస్తుతం 3 ట్రిలియన్ డాలర్ల కన్నా దిగువన ఉన్న ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చేందుకు పునాదులు నిన్న పడ్డాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఎండీ అండ్ సీఈఓ విజయ్ చందోక్ వ్యాఖ్యానించారు.
మౌలిక, ఉత్పత్తి రంగాలపై మరింత దృష్టిని సారించడం ముదావహమని, దీని కారణంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చందోక్ అంచనా వేశారు. పీఎస్యూ బ్యాంకుల మూలధన పునరుద్ధరణ, ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధానంలో సవరణలు ఆర్థిక స్థిరత్వానికి దోహదపడతాయని, ఈ ఆర్థిక సంవత్సరంలో మూలధన లక్ష్యాన్ని మరింతగా పెంచడం కూడా మేలు కలిగిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇదే సమయంలో సింగిల్ సెక్యూరిటీస్ మార్కెట్ కోడ్ ను ప్రవేశపెట్టడం మహమ్మారి ప్రభావం కొనసాగుతున్న ఈ సమయంలో సరైన నిర్ణయమని కేపీఎంజీ ఇండియా భాగస్వామి నవీన్ అగర్వాల్ అంచనా వేశారు. యాక్సిస్ సెక్యూరిటీస్ ప్రతినిధి గోప్ కుమార్ సైతం ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ బ్యాంకుల ఆస్తుల విక్రయం నుంచి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఎన్నో నిర్ణయాలు ఎకానమీ వృద్ధికి సహకరించనున్నాయని అన్నారు.