Farmers: రైతుల ఆందోళన.. ఈ నెల 6న దేశవ్యాప్తంగా ‘చక్కా జామ్’
- బడ్జెట్ కేటాయింపులతో మాకు పనిలేదు
- వ్యవసాయ చట్టాల రద్దే మేం కోరుకుంటున్నది
- 6న మధ్యాహ్నం 12 గంటల నుంచి రోడ్ల దిగ్బంధం
వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన రైతులు ఈ నెల 6న దేశవ్యాప్తంగా రాస్తా రోకో (చక్కా జామ్) నిర్వహించాలని నిర్ణయించారు. ఆ రోజున జాతీయ, రాష్ట్ర రహదారులను మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటలపాటు దిగ్బంధించనున్నట్టు రైతుల సంఘాలు నిన్న ప్రకటించాయి. పార్లమెంటులో నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి జరిగిన కేటాయింపులతో తమకు సంబంధం లేదని, తాము కోరుకుంటున్నది సాగు చట్టాల రద్దేనని రైతు నేత రాకేశ్ తికాయత్ స్పష్టం చేశారు.
ఢిల్లీ సరిహద్దుల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో బడ్జెట్ విషయాల గురించి తమకు ఎటువంటి సమాచారం లేదని పేర్కొన్నారు. పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర గురించి ప్రభుత్వం మాట్లాడడం లేదని, తాము ప్రధానితో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ రుణ లక్ష్యాన్ని పెంచినంత మాత్రాన ప్రయోజనం లేదని, రైతుల ఆదాయాన్ని పెంచే చర్యలు చేపట్టాలని గ్రామీణ్ కిసాన్ మజ్దూర్ సమితి నేత రంజీత్ రాజు పేర్కొన్నారు.