Shankar: తనపై వారెంట్ జారీ అయిందన్న వార్తలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తమిళ దర్శకుడు శంకర్

Shankar condemns the news that a court issued non bailable warrant against him

  • శంకర్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అంటూ ప్రచారం
  • ఖండించిన శంకర్
  • తనపై ఎలాంటి వారెంట్ లేదని స్పష్టీకరణ
  • నిజానిజాలు నిర్ధారించుకోవాలన్న శంకర్

'రోబో' కథ విషయంలో స్టార్ డైరెక్టర్ శంకర్ కు చెన్నై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్టు ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై దర్శకుడు శంకర్ స్పందించారు. తనపై వారెంట్ జారీ అయిందంటూ మీడియాలో వచ్చిన వార్తలు తనను దిగ్భ్రాంతికి గురిచేశాయని తెలిపారు. తన న్యాయవాది సాయి కుమరన్ ఇదే విషయమై చెన్నైలోని ఎగ్మూర్ మెట్రోపాలిట్ మేజిస్ట్రేట్ కోర్టును సంప్రదిస్తే, ఎలాంటి వారెంట్ జారీ చేయలేదని చెప్పారని శంకర్ వివరించారు. కోర్టు ఆన్ లైన్ వ్యవహారాల్లో తప్పిదం కారణంగా వారెంట్ అంటూ ప్రచారం జరిగి ఉండొచ్చని, ఇప్పుడా పొరబాటును దిద్దుతున్నారని శంకర్ తెలిపారు.

కానీ, ఎలాంటి నిర్ధారణ లేకుండానే తప్పుడు వార్తలు ప్రసారం కావడం తనను విస్మయానికి గురిచేసిందని తెలిపారు. ఈ పరిస్థితి కారణంగా తన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు అనవసరంగా వేదనకు గురయ్యారని వెల్లడించారు. దయచేసి తన తాజా ప్రకటనను మీడియా సంస్థలన్నీ మరింత ముందుకు తీసుకెళ్లి, తప్పుడు వార్తలు మరింత వ్యాప్తి చెందకుండా వుండాలని శంకర్ విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News