Nimmagadda Ramesh: ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించొద్దు: సీఎస్ కు నిమ్మగడ్డ రమేశ్ సూచన
- ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించొద్దు
- కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు ప్రైవేట్ వాహనాల్లోనే వెళ్లాలి
- ప్రభుత్వ పదవిని సూచించే బోర్డ్స్ వాహనాలపై ఉండరాదు
ఏపీ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ మరో లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన పలు సూచనలు చేశారు. 1994 పంచాయతీరాజ్ చట్టంలోని ఎన్నికల ప్రవర్తనా నియమావళి, 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించవద్దని లేఖలో నిమ్మగడ్డ పేర్కొన్నారు. కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు వివిధ ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ప్రభుత్వ వాహనాల్లో వెళ్లొద్దని, ప్రైవేటు వాహనాల్లోనే వారు ప్రయాణించాలని చెప్పారు. ఆయా శాఖల సిబ్బంది వారిని అనుసరించరాదని తెలిపారు. ప్రైవేట్ వాహనాలపై ప్రభుత్వ పదవిని సూచించే బోర్డ్స్ ఉపయోగించవద్దని పేర్కొన్నారు.
మరోపక్క, ఎస్ఈసీ, సీఎస్ మధ్య లేఖలపర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గుంటూరు, చిత్తూరు జిల్లాలకు హరినారాయణ్, బసంత్ కుమార్ లను కలెక్టర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని నిన్న సీఎస్ కు ఎస్ఈసీ లేఖ రాశారు. దీనిపై ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో, తమ ఆదేశాలను ఉల్లంఘించిన ప్రభుత్వంపై త్వరలోనే కోర్టుకు విన్నవిస్తామని చెప్పారు.