Lionel Messi: లయొనెల్ మెస్సీ... ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు!
- అర్జెంటీనా స్టార్ మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్
- క్లబ్ పోటీల్లో బార్సిలోనా జట్టుకు ప్రాతినిధ్యం
- పారితోషికంపై కథనం ప్రచురించిన ఎల్ ముండో
- ఏడాదికి రూ.1,217 కోట్లు అందుకుంటున్నాడని వెల్లడి
యూరప్, దక్షిణ అమెరికా దేశాల్లో ఫుట్ బాల్ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశాల మధ్య మ్యాచ్ ల కంటే క్లబ్ ల మధ్య జరిగే మ్యాచ్ లకు విపరీతమైన ప్రజాదరణ ఉంటుంది. ఎందుకంటే, మన ఐపీఎల్ తరహాలోనే ఫుట్ బాల్ క్లబ్బులు అనేక దేశాల స్టార్ ఆటగాళ్లను తీసుకొచ్చి వారికి భారీగా పారితోషికం చెల్లిస్తుంటాయి. ఇక, అంతర్జాతీయ ఫుట్ బాల్ రంగంలో సూపర్ స్టార్లు అంటే లయొనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, నేమార్, పోగ్బాల పేర్లు చెప్పుకోవాలి. వీరందరిలోకెల్లా అర్జెంటీనా దిగ్గజం లయొనెల్ మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది.
మెస్సీ యూరోపియన్ లీగ్ పోటీల్లో స్పెయిన్ కు చెందిన బార్సిలోనా క్లబ్ కు ప్రాతినిధ్యం వహిస్తుంటాడు. మెస్సీ తన నైపుణ్యంతో బార్సిలోనా జట్టుకు అనేక చిరస్మరణీయ విజయాలు అందించాడు. అసలు విషయం ఏంటంటే.... బార్సిలోనా క్లబ్ మెస్సీకి ఎంత పారితోషికం చెల్లిస్తుందన్నది ఇప్పటివరకు ఎక్కడా బహిర్గతం కాలేదు. తాజాగా, ఎల్ ముండో అనే పత్రిక మాత్రం దీనిపై ఏకంగా ఓ కథనం వెలువరించింది.
మెస్సీకి బార్సిలోనా క్లబ్ యాజమాన్యం రూ.4,906 కోట్లు చెల్లిస్తున్నట్టు వెల్లడించింది. నాలుగు సీజన్ల పాటు ఈ క్లబ్ తరఫున ఆడేందుకు ఈ మేరకు పారితోషికం చెల్లిస్తారని పేర్కొంది. ఏడాదికి రూ.1,217 కోట్లు అందుకుంటున్నాడని, అందులో సగం పన్నులు చెల్లిస్తున్నాడని ఎల్ ముండో వివరించింది. అయితే, మెస్సీతో తమ ఒప్పందం వివరాలు బహిర్గతం కావడంతో బార్సిలోనా ఫుట్ బాల్ క్లబ్ మండిపడుతోంది. ఎల్ ముండో పత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అటు, మెస్సీ కూడా ఎల్ ముండో పత్రికపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడట. చట్టపరమైన చర్యలకు మెస్సీ సిద్ధమవుతున్నట్టు సాకర్ వర్గాలంటున్నాయి.