Khreivitso Kense: పదహారేళ్ల నాగాలాండ్ యువ బౌలర్ ను ట్రయల్స్ కు పిలిచిన ముంబయి ఇండియన్స్
- త్వరలోనే ఐపీఎల్ 14వ సీజన్
- నాగాలండ్ యువ బౌలర్ పై కన్నేసిన ముంబయి
- సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో సత్తా చాటిన కెన్సే
- 4 మ్యాచ్ ల్లో 7 వికెట్లు
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ నాగాలాండ్ కు చెందిన ఓ యువ స్పిన్నర్ ను ట్రయల్స్ కు పిలవడం ఆసక్తి కలిగిస్తోంది. ఐపీఎల్ లో అత్యధిక పర్యాయాలు టైటిల్ నెగ్గిన జట్టుగా ఖ్యాతి పొందిన ముంబయి ఇండియన్స్ జట్టు నుంచి ఆహ్వానం అందడం అంటే మామూలు విషయం కాదు.
ఇంతకీ ఆ కుర్ర స్పిన్నర్ పేరు ఖ్రీవిట్సో కెన్సే. వయసు 16 సంవత్సరాలు మాత్రమే. కెన్సే ఓ లెగ్ స్పిన్నర్. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో కెన్సే అద్భుత ప్రదర్శన కనబరిచాడు. దాంతో అతడిపై ముంబయి ఇండియన్స్ వర్గాలు కన్నేశాయి.
తమ బౌలర్ కు ముంబయి ఇండియన్స్ నుంచి పిలుపు వచ్చిన విషయాన్ని నాగాలాండ్ క్రికెట్ సంఘం కార్యదర్శి హ్యునిలో అనిలో ఖింగ్ నిర్ధారించారు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో 4 మ్యాచ్ లు ఆడిన కెన్సే 7 వికెట్లతో సత్తా చాటాడు.