OTT: వెబ్ సిరీస్ లపై పెరుగుతున్న ఫిర్యాదులు... ఇకపై ఓటీటీలకు కూడా మార్గదర్శకాలు
- సినిమా హాళ్లలో 100 శాతం ప్రేక్షకులకు అనుమతి
- మీడియాతో మాట్లాడిన ప్రకాశ్ జవదేకర్
- ఓటీటీల నియంత్రణకు వ్యవస్థలు లేవని వెల్లడి
- కంటెంట్ పై అభ్యంతరాలు వస్తున్నాయని వివరణ
సినిమా హాళ్లలో 100 శాతం ప్రేక్షకులతో ప్రదర్శనలకు కేంద్రం అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఓటీటీలపై స్పందించారు. ఇటీవల ఓటీటీల్లో ప్రసారమవుతున్న వెబ్ సిరీస్ లపై వస్తున్న ఫిర్యాదుల సంఖ్య అధికమవుతోందని, ఇకపై ఓటీటీలకు కూడా ప్రసార మార్గదర్శకాలు తప్పనిసరి చేస్తామని ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు.
ఓటీటీ కంటెంట్ పై పరిశీలన కోసం ఎలాంటి వ్యవస్థలు లేవని, ప్రెస్ కౌన్సిల్, కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ చట్టం, సెన్సార్ బోర్డు వంటి సంస్థల పరిధిలో లేకపోవవడంతో ఓటీటీపై నియంత్రణ కొరవడిందని వివరించారు. అందుకే ఓటీటీలను నియంత్రించేలా మార్గదర్శకాలు రూపొందిస్తామని తెలిపారు.