Virat Kohli: కోహ్లీని ఎలా అవుట్ చేయాలో, ఏంటో!: సిరీస్ కు ముందే ఇంగ్లాండ్ జట్టులో ఆందోళన
- భారత పర్యటనకు విచ్చేసిన ఇంగ్లాండ్ జట్టు
- టీమిండియాతో నాలుగు టెస్టుల సిరీస్
- కోహ్లీపై ప్రణాళికలేవీ రచించలేదన్న మొయిన్ అలీ
- కోహ్లీ టెక్నిక్ లో లోపాలు లేవని వ్యాఖ్యలు
- అయితే తమకు నాణ్యమైన బౌలర్లున్నారని వెల్లడి
జో రూట్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ జట్టు భారత్ లో నాలుగు టెస్టులు ఆడేందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తొలి రెండు టెస్టులు చెన్నైలో జరగనుండగా, ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు అక్కడే సన్నద్ధమవుతోంది. అయితే, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఎలా కట్టడి చేయాలన్న దానిపై ఇంగ్లాండ్ శిబిరం మల్లగుల్లాలు పడుతోంది. ఆ జట్టు ఆల్ రౌండర్ మొయిన్ అలీ వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. కోహ్లీని ఎలా అవుట్ చేయాలన్నది తెలియడంలేదని అన్నాడు.
ఇటీవలే ఆస్ట్రేలియాలో చిరస్మరణీయ సిరీస్ లో ఆడని కోహ్లీ మరింత పరుగుల దాహంతో రగిలిపోతుంటాడని తెలిపాడు. ఆసీస్ తో టెస్టు సిరీస్ ఆడని లోటును ఈ సిరీస్ ద్వారా తీర్చుకునే ప్రయత్నం చేస్తాడని, ఆ అంశమే కోహ్లీలో అదనపు ప్రేరణ కలిగిస్తుందని మొయిన్ అలీ అభిప్రాయపడ్డాడు.
"అతడ్ని మేం ఎలా అవుట్ చేయాలి? అతడేమో అద్భుతమైన ఆటగాడు. ప్రపంచస్థాయి ఆటగాడు. మాపై టెస్టు సిరీస్ లో మరింత కసితో బరిలో దిగుతాడని భావిస్తున్నాం. ఇప్పటివరకైతే కోహ్లీని అవుట్ చేసే ప్రణాళికలేవీ మేం రచించలేదు. అతడి టెక్నిక్ లో ఏదైనా లోపం ఉంటుందని నేను అనుకోవడంలేదు. కానీ మాకు నాణ్యమైన బౌలింగ్ విభాగం ఉంది. మంచి పేసర్లు జట్టులో ఉన్నారు" అని మొయిన్ అలీ వివరించాడు. కాగా, భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు ఫిబ్రవరి 5 నుంచి చెన్నైలో జరగనుంది.