Greta Thunberg: నోబెల్ శాంతి బహుమతి రేసులో గ్రెటా థన్ బెర్గ్, డబ్ల్యూహెచ్ఓ
- నోబెల్ శాంతి పురస్కారానికి నామినేషన్లు
- బరిలో థన్ బెర్గ్, నావల్నీ, డబ్ల్యూహెచ్ఓ
- పర్యావరణానికి పాటుపడుతున్న థన్ బెర్గ్
- రష్యాలో ప్రజాస్వామ్యం కోసం నావల్నీ కృషి
- అందరికీ కరోనా వ్యాక్సిన్ దిశగా డబ్ల్యూహెచ్ఓ ప్రయత్నాలు
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డుగా నోబెల్ శాంతి బహుమతిని భావిస్తారు. ఈ పర్యాయం నోబెల్ శాంతి పురస్కారం రేసులో బాల పర్యావరణవేత్త గ్రెటా థన్ బెర్గ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ ఉన్నారు.
18 ఏళ్ల గ్రెటా థన్ బెర్గ్ పిన్న వయసులోనే ప్రపంచ పర్యావరణంపై ఎలుగెత్తుతున్న తీరు అంతర్జాతీయ సమాజాన్ని విశేషంగా ఆకట్టుకుంది. అనేక ప్రపంచవేదికలపై పర్యావరణ అంశాలపై ఆమె ధైర్యంగా గళం విప్పారు. స్వీడన్ కు చెందిన గ్రెటాను ఇప్పటికే పలు అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి.
ఇక, రష్యాకు చెందిన అలెక్సీ నావల్నీ తన దేశంలో శాంతియుత ప్రజాస్వామ్యం కోసం ఏళ్ల తరబడి కృషి చేస్తున్నారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విధానాలను వ్యతిరేకించే నావల్నీపై ఇటీవలే విషప్రయోగం జరిగిన సంగతి తెలిసిందే. ఆయన 5 నెలల పాటు జర్మనీలో చికిత్స పొంది ప్రాణాలు దక్కించుకున్నారు. అయితే ఇటీవలే జర్మనీ నుంచి రష్యా వచ్చిన నావల్నీని అరెస్ట్ చేయడంతో రష్యాలో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి.
ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించే వ్యాక్సిన్ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చూపుతున్న చొరవ, పేద దేశాలకు కూడా కరోనా వ్యాక్సిన్ అందించేందుకు పడుతున్న తాపత్రయం ఈ అత్యున్నత ఆరోగ్య సంస్థను నోబెల్ శాంతి బహుమతి రేసులో నిలిపాయి.