AIADMK: శశికళను పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదు: మరోమారు తెగేసి చెప్పిన మంత్రి జయకుమార్
- నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న శశికళ
- ఎఎంఎకేను పార్టీలో విలీనం చేసుకునే ప్రసక్తే లేదన్న మంత్రి
- అన్నాడీఎంకే కంచుకోటను ఎవరూ బద్దలుగొట్టలేరని వ్యాఖ్య
అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష పూర్తిచేసుకుని ఇటీవలే జైలు నుంచి విడుదలైన అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ వేడి రగులుకుంది. ఆమె వచ్చినా పార్టీలో తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదని కేబినెట్ మంత్రి డి. జయకుమార్ మరోమారు తేల్చి చెప్పారు. అన్నాడీఎంకే కంచుకోట అని, దానిని ఎవరూ బద్దలుగొట్టలేరని అన్నారు.
శశికళను పార్టీలో చేర్చుకోబోమని స్పష్టం చేసిన జయకుమార్.. ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్ సారథ్యంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కళకం (ఎఎంఎంకే) ను అన్నాడీఎంకేలో విలీనం చేసే ప్రసక్తే లేదన్నారు. దినకరన్ సారథ్యంలోని ‘నమదు ఎంజీఆర్’ పత్రికలో అన్నాడీఎంకేని దుష్టుల నుంచి శశికళ కాపాడతారని, పార్టీపై తిరిగి పట్టుసాధిస్తారని రాసిన వ్యాసంపై స్పందిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.