Revanth Reddy: మోదీ ఒళ్లో కూర్చొని కేసీఆర్ ద్రోహిగా మిగిలిపోయారు: రేవంత్ రెడ్డి
- పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగాన్ని 18 పార్టీలు వ్యతిరేకించాయి
- కేసీఆర్ మాత్రం మోదీ ప్రభుత్వానికి మద్దతు పలికారు
- రైతులకు అన్ని విధాలా కాంగ్రెస్ మద్దతుగా ఉంటుంది
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీర్ ప్రధాని మోదీతో లోపాయికారీగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగాన్ని 18 పార్టీలు బహిష్కరిస్తే... కేసీఆర్ మాత్రం అనుకూలంగా వ్యవహరించారని అన్నారు. మోదీ ఒళ్లో కూర్చొని రైతు ద్రోహిగా కేసీఆర్ మిగిలిపోయారని విమర్శించారు. కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునేంత వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని అన్నారు.
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాడుతున్నారని... రైతుల సంక్షేమాన్ని విస్మరించి, మోదీకి కేసీఆర్ వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. రైతులకు అండగా నిలవాల్సిన కేసీఆర్... వారికి వ్యతిరేకంగా ముందుకు సాగుతున్నారని విమర్శించారు. దేశ వ్యాప్తంగా ఉన్న రైతుల్లో ఇప్పుడు క్లారిటీ వచ్చిందని... తమ పక్షాన ఎవరు ఉన్నారు? ఎవరు లేరు? అనే విషయం వారికి అర్థమయిందని చెప్పారు. ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తామని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ చెప్పారని... ఇంత వరకు ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. మోదీకి వ్యతిరేకంగా రైతులు కదం తొక్కుతున్నారని... వారికి అన్ని విధాలా కాంగ్రెస్ మద్దతుగా ఉంటుందని చెప్పారు.