Local Body Polls: ఏపీలో పంచాయతీ ఎన్నికల దృష్ట్యా సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు
- వచ్చేనెల 9, 11, 13, 21 తేదీల్లో ఎన్నికలు
- ఆయా తేదీల్లో స్థానిక సెలవులు
- ఎన్నికలకు 44 గంటల ముందు నుంచి మద్యం దుకాణాల బంద్
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా అన్ని దశ పోలింగ్ రోజుల్లో సెలవులు ప్రకటిస్తూ ఈ రోజు ఉత్తర్వులు జారీ అయ్యాయి. వచ్చేనెల 9, 11, 13, 21 తేదీల్లో ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో ప్రభుత్వ సెలవును ప్రకటించారు. అలాగే, ఆయా ప్రాంతాల్లో ఎన్నికలకు 44 గంటల ముందు నుంచి ఆయా పంచాయతీల్లో మద్యం దుకాణాలను బంద్ చేయాలి.
ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలను వాడుకోవాల్సి ఉన్నందున స్థానిక సెలవులను ప్రకటించారు. అలాగే, పాఠశాలలు, దుకాణాలకు కూడా సెలవులు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఎన్నికల సామగ్రి పంపిణీకి వాహనాలను సిద్ధం చేయాలని ఎస్ఈసీ ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవ్వరూ ఏ అభ్యర్థికీ ఎన్నికల ఏజెంట్ గా ఉండరాదని తెలిపింది.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందుకు దాన్ని కచ్చితంగా పాటించాలని సూచించింది. పోలింగ్ బాక్సులతో పాటు సిబ్బందిని పోలింగ్ కేంద్రాల వద్దకు తరలించేందుకు భారీగా వాహనాలు అవసరమవుతున్నందున పలు ప్రభుత్వ శాఖలకు చెందిన వాహనాలు వినియోగించుకునేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని పేర్కొంది.