Corona Virus: కరోనా రోగులతో నిండిపోతున్న మెక్సికో ఆసుపత్రులు.. భారత్ కన్నా అధికంగా కరోనా మరణాలు
- భారత్తో పోల్చి చూస్తే మెక్సికోలో కొవిడ్ కేసుల సంఖ్య తక్కువ
- అయినప్పటకీ మరణాలు మాత్రం ఎక్కువ
- మెక్సికోలో 40 శాతం మందికి కరోనా
- కరోనా నిబంధనలను తప్పనిసరి చేయని వైనం
కరోనా వైరస్ విజృంభించకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న మెక్సికోలో వైరస్ విజృంభణ అధికంగా ఉంది. ఈ దేశ అధ్యక్షుడు ఆండ్రెజ్ మాన్యుయెల్ లోపెజ్ ఓబ్రడార్ కు కూడా ఇటీవల కరోనా సోకింది. ఆ దేశంలో ప్రతిరోజు భారత్ కంటే అధికంగా కరోనా మరణాలు చోటుచేసుకుంటున్నాయి.
భారత్లో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,07,33,131కు చేరిన విషయం తెలిసిందే. అలాగే, మృతుల సంఖ్య 1,54,147 కు పెరిగింది. భారత్తో పోల్చి చూస్తే, మెక్సికోలో కొవిడ్ కేసుల సంఖ్య తక్కువగా దాదాపు 18,25,000 ఉన్నప్పటికీ, మరణాలు మాత్రం భారత్ కంటే అధికంగా ఉన్నాయి.
ఇప్పటి వరకు దాదాపు 1,55,000 పైగా మరణాలు నమోదయ్యాయి. మరణాల సంఖ్య అధికంగా ఉన్న దేశాల్లో భారత్ ఇంతకు ముందు మూడో స్థానంలో ఉండేది. ఇప్పుడు మెక్సికో ఆ మూడో స్థానానికి ఎగబాకింది. కాగా, కరోనా మరణాల విషయంలో అమెరికా తొలి స్థానంలో ఉండగా, బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో మెక్సికో, భారత్ ఉన్నాయి.
మెక్సికో అధికారిక లెక్కల ప్రకారం ఆ దేశంలో 40 శాతం మందికి పైగా కరోనా బారిన పడడం గమనార్హం. అంతేగాక, రాజధాని మెక్సికో నగరంలోని ఆసుపత్రులు 90 శాతానికి పైగా కరోనా రోగులతో నిండిపోయాయి. మిగిలిన ఎనిమిది రాష్ట్రాల్లో 70 శాతం కంటే ఎక్కువగా కరోనా రోగులే ఉన్నారు.
కరోనా కట్టడిలో భాగంగా ఇతర దేశాలు మొదటి నుంచి తీసుకుంటున్న చర్యలను మెక్సికో తీసుకోకపోవడమే ఆ దేశంలో కరోనా విజృంభణకు కారణం. మెక్సికో అధ్యక్షుడు మాన్యుయెల్ లోపెజ్ లాక్డౌన్పై సానుకూల వైఖరితో లేకపోవడం వల్లే భారీ జనాభా ఉన్న దేశాల కంటే తక్కువ జనాభా ఉన్న మెక్సికోలో కరోనా విజృంభణ అధికంగా ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఆ దేశంలో మాస్కు, సామాజిక దూరం తదితర నిబంధనలను తప్పనిసరి చేయలేదు. ఆ దేశ అధ్యక్షుడు కూడా నిర్లక్ష్యంగా విమానాల్లో మాస్కు లేకుండా ప్రయాణించారు.