Jana Reddy: పార్టీ కార్యకర్తలు అంగీకరిస్తే నా కుమారుడు పోటీలో ఉంటాడు: జానారెడ్డి
- త్వరలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు
- జానా కుమారుడు రఘువీర్ రెడ్డి అభ్యర్థిత్వంపై ఊహాగానాలు
- నిర్ణయాన్ని అనుచరులకే వదిలేసిన జానారెడ్డి
- అనుచరులే పోటీ చేసినా అభ్యంతరం లేదని వెల్లడి
- వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని ఉద్ఘాటన
నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తలు అంగీకరిస్తే తన కుమారుడు రఘువీర్ రెడ్డి నాగార్జునసాగర్ బరిలో ఉంటాడని తెలిపారు. అలాకాకుండా, కార్యకర్తలు ఎవరి పేరు సూచించినా తనకు అభ్యంతరం లేదని, కార్యకర్తలు సూచించినవారే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని స్పష్టం చేశారు. వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకం అని జానారెడ్డి పేర్కొన్నారు. ఇవాళ తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తన కుమారుడు రఘువీర్ ను నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయించే అంశంపై ప్రధాన అనుచరుల అభిప్రాయాలు తీసుకుంటానని, తన ప్రధాన అనుచరుల్లో ఎవరైనా పోటీ చేస్తామని ముందుకొస్తే వాళ్లకు అవకాశం ఇవ్వడానికి కూడా తాను సిద్ధమేనని అన్నారు. జానారెడ్డికి నాగార్జునసాగర్ ప్రాంతంలో గట్టి పట్టు ఉంది. గత ఎన్నికల్లో ఓటమి పాలైనా, అంతకుముందు అనేక పర్యాయాలు అక్కడ విజయాలు సాధించారు.