Nimmagadda Ramesh: మాకు తెలియకుండా ప్రకటనలు ఎలా ఇస్తారు?: ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేశ్ ప్రశ్న
- ఏకగ్రీవాలపై ప్రకటనలు ఇచ్చిన ప్రభుత్వం
- ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం లేదన్న నిమ్మగడ్డ
- బలవంతపు ఏకగ్రీవాలు చేసే వారిని హౌస్ అరెస్ట్ చేస్తామని హెచ్చరిక
ఏపీలో రాష్ట్ర ప్రభుత్వానికి, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కు మధ్య వివాదం కొనసాగుతోంది. ప్రభుత్వంపై నిమ్మగడ్డ మరోసారి విమర్శలు గుప్పించారు. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఎస్ఈసీకి తెలియకుండా ప్రకటనలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ ప్రకటనలు ఇచ్చిన అధికారులను వివరణ కోరామని చెప్పారు. కర్నూలు జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏకగ్రీవాల కోసం రాష్ట్ర గవర్నర్ ను పలు పార్టీల నేతలు కలిశారని నిమ్మగడ్డ చెప్పారు. ఏకగ్రీవాలు మంచిదేనని... అయితే అవి సామరస్యపూర్వకంగా ఉండాలని అన్నారు. భయపెట్టి, బలవంతం చేసి ఏకగ్రీవాలు చేయడం సరికాదని చెప్పారు. ప్రజాస్వామ్యం అంటే భిన్నాభిప్రాయాల నుంచి ఏకాభిప్రాయం సాధించడమని అన్నారు. ఎన్నికల్లో జోక్యం చేసుకుని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వారిపై నిఘా పెట్టాలని చెప్పారు. బలవంతపు ఏకగ్రీవాలు చేసే వారిని హౌస్ అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. అధికారాలను దుర్వినియోగం చేసే వారిపై నిఘా ఉంచాలని అన్నారు.