Deep Sidhu: మీ రహస్యాలను బయటపెడితే.. తలలెక్కడ పెట్టుకుంటారు?: రైతు నేతలపై దీప్​ సిద్ధూ సంచలన వ్యాఖ్యలు

Deep Sidhu threatens to reveal secrets of kisan netas

  • ఎర్రకోట వద్ద ఆందోళనలకు సమర్థన
  • వారిని విమర్శించడం కాదు.. మద్దతివ్వాలని డిమాండ్
  • రైతు నేతల నిర్ణయంతోనే రైతులు తరలివచ్చారని వెల్లడి
  • ఫేస్ బుక్ లైవ్ లో వెల్లడించిన దీప్ సిద్ధూ

సాగు చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్ తో ఆందోళన చేస్తున్న రైతు నేతలపై పంజాబీ నటుడు, గాయకుడు దీప్ సిద్ధూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి రహస్యాలను తాను బయటపెడితే తలలు ఎక్కడ పెట్టుకుంటారంటూ ప్రశ్నించారు. గురువారం ఆయన ఫేస్ బుక్ లైవ్ ద్వారా దీనిపై స్పందించారు.

గణతంత్ర దినోత్సవాన రైతు నేతలు చేసిన ట్రాక్టర్ ర్యాలీ ఎంత హింసాత్మకమైందో తెలిసిందే. ఎర్రకోటను రైతులు ముట్టడించారు. ఆందోళనల్లో ఓ వ్యక్తి ప్రాణాలు కూడా కోల్పోయాడు. అయితే, ఆ ఉచ్చు మొత్తం దీప్ సిద్ధూ మెడకు చుట్టుకుంది. రైతులను ఆయనే రెచ్చగొట్టాడంటూ వీడియో వైరల్ అయింది. ఇటు రైతు ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న సంయుక్త్ కిసాన్ మోర్చా (ఎస్కేఎం) కూడా దీప్ సిద్ధూనే హింసకు కారకుడు అంటూ ఆరోపించింది. హింసకు ప్రేరేపించి రైతులను విలన్లుగా మార్చాడంటూ మండిపడింది.

దీనిపై ఫేస్ బుక్ లైవ్ లో దీప్ సిద్ధూ స్పందించారు. తనపై చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. ‘‘సిగ్గులేకుండా నాపై మీరు నింద మోపారు. మీ నిర్ణయంతోనే ట్రాక్టర్ ర్యాలీకి జనం తరలివచ్చారు. వాళ్లంతా మీ మాటలనే అనుసరించారు. లక్షలాది మంది నా నియంత్రణలో ఎలా ఉంటారు? నేనే గానీ అంతమందిని రెచ్చగొట్టి ఉంటే మీరంతా ఎక్కడ ఉంటారు? అసలు దీప్ సిద్ధూకు అనుచర గణమే లేదని, ఉద్యమంలో అతడి పాత్ర ఏమీ లేదని మీరే చెప్పారు కదా. అలాంటప్పుడు లక్షలాది మందిని నేనెలా తీసుకురాగలను?’’ అని దీప్ సిద్ధూ మండిపడ్డారు.

తాను ఇప్పటికీ సింఘూ సరిహద్దుల్లోనే ఉన్నానని, రైతు నేతల రహస్యాలను తాను బయటపెడితే తలలు ఎక్కడ పెట్టుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రకోట వద్ద ఆందోళనలు చేసిన రైతులపై విమర్శలు చేసే కన్నా మద్దతు ఇస్తే బాగుంటుందని ఆయన అన్నారు. అక్కడ ఆందోళనలు చేసిన వారికి రైతు నేతలు ఎందుకు మద్దతు తెలపలేదని ప్రశ్నించారు. వారికి మద్దతునిచ్చి ఉంటే ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురాగలిగేవాళ్లమని అన్నారు. నవంబర్ 26న బారికేడ్లను నెట్టుకుని ఢిల్లీలోకి ప్రవేశించి కేంద్ర ప్రభుత్వాన్ని మేల్కొలిపామని, జనవరి 26న మరోసారి మేల్కొలిపామని అన్నారు.

తాను ఆరెస్సెస్ ఏజెంట్ అన్న ఆరోపణలపైనా ఆయన వివరణ ఇచ్చారు. ఒకవేళ తాను ఆరెస్సెస్ ఏజెంట్ నో లేదంటే బీజేపీ వ్యక్తినో అయి ఉంటే, ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే ఎర్రకోటపై నిషాన్ సాహిబ్ జెండాను ఎందుకు ఎగరేలా చేస్తానని ప్రశ్నించారు. ఎర్రకోట వద్ద ఆందోళన చేసిన వారందరినీ దేశ ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

  • Loading...

More Telugu News