Anil Kumar Yadav: కనీసం నామినేషన్ వేసే సత్తా, దమ్ము కూడా వాళ్లకు లేవు: ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్

Anil Kumar Yadav makes sensational comments
  • 25 శాతం సీట్లయినా సాధించే సత్తా టీడీపీకి ఉందా?
  • 5 శాతం సీట్లు కూడా సాధించలేని తోక పార్టీలు మాట్లాడుతున్నాయి
  • 80 శాతం సీట్లను వైసీపీ కైవసం చేసుకుంటుంది
పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో ఏపీలో పొలిటికల్ హీట్ అమాంతం పెరిగింది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వివిధ పార్టీల నేతలు కొన్ని సందర్భాలలో తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా అదే తరహా వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికలు వస్తే సత్తా చూపుతామంటూ విపక్ష నేతలు మాట్లాడారని... ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని... ఏం పీకుతారో పీకి సత్తా చూపించండని అనిల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి కనీసం 25 శాతం సీట్లయినా సాధించే సత్తా ఉందా? అని ప్రశ్నించారు. కనీసం నామినేషన్ వేసే సత్తా, దమ్ము కూడా వారికి లేవని ఎద్దేవా చేశారు. కనీసం 5 శాతం సీట్లను కూడా సాధించలేని కొన్ని తోక పార్టీల మాటల కోటలు దాటుతున్నాయని అన్నారు.

నంద్యాల డైరీ ఎన్నికల్లో 80 శాతం ఓట్లతో గెలుపొందామని... పంచాయతీ ఎన్నికల్లో సైతం 80 శాతం సీట్లను వైసీపీ కైవసం చేసుకుంటుందని అనిల్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల ద్వారా వైసీపీ సత్తా ఏమిటో చాటుతామని అన్నారు. ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి నివాసంలో జరిగిన సమావేశానికి అనిల్ హాజరయ్యారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, నేతలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.
Anil Kumar Yadav
YSRCP
Gram Panchayat Elections

More Telugu News