Australia: మొసలిని గెలిచిన మొనగాడు.. మెడ దగ్గర పట్టినా పోరాడి బతికిన వ్యక్తి!
- ఆస్ట్రేలియా లేక్ ప్లాసిడ్ వద్ద ఘటన
- పోరాటంలో వేలు పోగొట్టుకున్న బాధితుడు
- బతికి బయటపడిన 44 ఏళ్ల వ్యక్తి
నీళ్లలోన మొసలి నిగిడి యేనుగు బట్టు.. అంటుంది వేమన పద్యం. అవును మరి, నీళ్లలో ఉన్నప్పుడు దాని బలం అంతలా ఉంటుంది. అది పట్టిందంటే దాని కత్తుల్లాంటి పళ్ల నుంచి తప్పించుకోవడం అసాధ్యం. కానీ, ఆస్ట్రేలియాలో ఓ 44 ఏళ్ల వ్యక్తి మాత్రం చావు అంచుల దాకా వెళ్లి బయటపడ్డాడు. అతడి తలను మొసలి పట్టేసినా.. పోరాడి వదిలించుకుని బతుకుజీవుడా అనుకుంటూ బయటపడ్డాడు.
ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన గురువారం ఆస్ట్రేలియాలోని కెయిర్న్స్ లో ఉన్న లేక్ ప్లాసిడ్ వద్ద జరిగింది. కొలనులో ఈతకు వెళ్లిన అతడిని వెనుక నుంచి వచ్చిన మొసలి మెడ దగ్గర పట్టేసిందని, కానీ, బాధితుడు ధైర్యంగా మొసలితో పోరాడాడని క్వీన్స్ ల్యాండ్ అంబులెన్స్ పారామెడిక్ చెప్పారు. దాని నుంచి తప్పించుకునేందుకు అతడు తన చేతులనే ఆయుధంగా మలుచుకున్నాడని, తన తలను అది కొరికేయకుండా బలంగా పోరాడి తప్పించుకున్నాడని చెప్పారు.
ఆ పోరాటంలో బాధితుడి ఎడమ చేతి చూపుడు వేలు తెగిపోయిందన్నారు. వెంటనే అక్కడి నుంచి వేగంగా ఒడ్డుకు చేరాడన్నారు. తల, వీపు, భుజాలపై గాయాలయ్యాయని చెప్పారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, కాకపోతే ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదని అన్నారు.