Delhi: రైతు సంఘాల నేతలపై లుకౌట్ నోటీసులు జారీ.. రంగంలోకి దిగిన ఎన్ఐఏ

  • గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో హింస
  • ఖలిస్థాన్ మద్దతుదారులు చొరబడ్డారని అనుమానాలు
  • రైతు సంఘాల నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు
Lookout notice issued against farmer leaders

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో అల్లర్లు చోటు చేసుకున్నాయి. రైతులు ఏకంగా ఎర్రకోట వరకు దూసుకెళ్లి, కోటపై మతపరమైన జెండాను ఎగురవేశారు. ఈ ఘటన కలకలం రేపుతోంది. రైతుల ముసుగులో ఖలిస్థాన్ మద్దతుదారులు అరాచకాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఖలిస్థాన్ హస్తంపై ఎన్ఐఏ సైతం రంగంలోకి దిగి, విచారణ ప్రారంభించింది.

మరోవైపు, అల్లర్లపై ఢిల్లీ పోలీసులు సైతం దర్యాప్తును వేగవంతం చేశారు. రైతుల ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న రాకేశ్ తికాయత్, యోగేంద్ర యాదవ్, గుర్నాం సింగ్, దర్శన్ పాల్ సహా పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు, లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇదిలావుంచితే, మరోవైపు సీనియర్ అధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి సమీక్షను నిర్వహించారు. మొన్నటి అల్లర్లలో గాయపడిన పోలీసులు చికిత్స పొందుతున్న ఆసుపత్రుల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆసుపత్రుల చుట్టూ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులు మోహరించారు. హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎర్రకోట వద్ద కూడా భారీగా బలగాలను మోహరింపజేశారు. ఈ నెలాఖరు వరకు ఎర్రకోటను మూసేశారు.

More Telugu News