Navreeth Singh: ఆస్ట్రేలియా నుంచి భారత్ కు వచ్చి ఢిల్లీ కిసాన్ పరేడ్ లో కడతేరిపోయిన నవ్రీత్ సింగ్!

  • గణతంత్ర దినోత్సవాన రైతుల ట్రాక్టర్ ర్యాలీ
  • ఐటీవో వద్ద ట్రాక్టర్ బోల్తా
  • 27 ఏళ్ల నవ్రీత్ సింగ్ మృతి
  • విద్యాభ్యాసం కోసం ఆస్ట్రేలియా వెళ్లిన నవ్రీత్
  • అక్కడే వివాహం
  • పెళ్లి విందు కోసం భారత్ రాక
Navreeth Singh tragedy in Farmers Kisan Parade

భారత్ లో గణతంత్ర దినోత్సవాన రైతులు కూడా కిసాన్ పరేడ్ పేరిట కదం తొక్కిన సంగతి తెలిసిందే. వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ భారీ ఎత్తున ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. అయితే, ఈ సందర్భంగా ఢిల్లీ ఐటీవో వద్ద జరిగిన ఘటనలో నవ్రీత్ సింగ్ (27) అనే వ్యక్తి మృతి చెందాడు. బారికేడ్లను ఢీకొట్టే క్రమంలో ట్రాక్టర్ ను వేగంగా నడిపిన నవ్రీత్... ఆ ప్రయత్నంలో ట్రాక్టర్ బోల్తాపడడంతో ప్రాణాలు కోల్పోయాడు.

వాస్తవానికి నవ్రీత్ రైతు కాదు. ఉన్నత విద్యాభ్యాసం కోసం ఉత్తరప్రదేశ్ నుంచి ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడే తన మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే భారత్ లో ఉన్న తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పి, బంధుమిత్రులందరికీ విందు ఇవ్వాలని ఇటీవలే స్వదేశానికి వచ్చాడు. ఇంతలో ఢిల్లీ రైతు నిరసనలు ఉద్ధృతం కావడంతో నవ్రీత్ సింగ్ కూడా ఈ దిశగా ఆకర్షితుడయ్యాడు. బంధువర్గంలోని కొందరు ట్రాక్టర్ ర్యాలీకి వెళుతుండడంతో వారితో పాటే తాను కూడా బయల్దేరాడు.

కానీ ఢిల్లీ ఐటీవో వద్ద జరిగిన ప్రమాదంలో కన్నుమూశాడు. నవ్రీత్ మృతిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేసి, పోలీసులు ప్రయోగించిన బాష్పవాయు గోళం కారణంగానే చనిపోయాడని ఆరోపించారు. షెల్ నవ్రీత్ కు తగలడంతో ట్రాక్టర్ అదుపు తప్పిందన్నది వారి వాదన. దాంతో పోలీసులు సీసీ కెమెరా ఫుటేజి విడుదల చేశారు. అధికవేగం కారణంగానే ట్రాక్టర్ బోల్తాపడిందని పోలీసులు స్పష్టం చేశారు.

More Telugu News