Maharashtra: ఉద్ధవ్ థాకరే డిమాండుకు కర్ణాటక డిప్యూటీ సీఎం కౌంటర్

  • కర్ణాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదాలు
  • మరాఠీ మాట్లాడే ప్రాంతాలను కలిపేసుకుంటామన్న థాకరే
  • ముంబయిపై తమకూ హక్కుందన్న లక్ష్మణ్ సవాడి
  • ముంబయిని యూటీ చేయాలని డిమాండ్
War of words between Maharashtra and Karnataka

కర్ణాటక, మహారాష్ట్ర మధ్య భాషా ప్రయుక్త పరమైన వివాదాలు భగ్గుమంటున్నాయి. కర్ణాటకలోని మరాఠీ మాట్లాడే ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్న సమయంలో కర్ణాటక సర్కారు కోర్టు ధిక్కారానికి పాల్పడిందని, బెళగావి పేరు మార్చిందని అన్నారు. సరిహద్దుల్లో ఉన్న గ్రామాలను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరారు. థాకరే అంతకుముందు కూడా, కర్ణాటకలోని మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలో కలిపేసేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు.

ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాడి మండిపడ్డారు. ముంబయినే కర్ణాటకలో కలిపేయాలని, అది వీలు కాకపోతే ముంబయిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని లక్ష్మణ్ సవాడి గట్టిగా బదులిచ్చారు. ఆ మేరకు కేంద్రాన్ని కోరారు. బెళగావి ప్రాంతానికి చెందిన తాము గతంలో ముంబయి పరిధిలోని వారమేనని, అందుకే ముంబయిపై తమకు కూడా హక్కుందని భావిస్తున్నామని సవాడి స్పష్టం చేశారు. సరిహద్దు వివాదంపై సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నామని చెప్పారు.

More Telugu News