Chandrababu: 'స్థానిక' ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు.. వైసీపీపై ధ్వజం
- ప్రజల ఆమోదం లేని ఈ తరహా ఏకగ్రీవాలను ఉపేక్షించం
- 2,274 ఏకగ్రీవాలు చేశారు
- ఏం అభివృద్ధి చేశారని ఏకగ్రీవాలు చేయాలని అడుగుతారు?
- ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా కొనసాగిస్తున్నారా?
స్థానిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు విడుదల చేశారు. పల్లె ప్రగతి-పంచ సూత్రాల పేరిట ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. తాము గెలిస్తే స్వచ్ఛత-పరిశుభ్రతతో ఆదర్శ గ్రామాలను తీర్చిదిద్దుతామని చంద్రబాబు నాయుడు చెప్పారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లను అడ్డుకుంటామని తెలిపారు. ఆస్తి పన్ను తగ్గించి పౌర సేవలు అందిస్తామని వివరించారు. గ్రామాల్లో ప్రజలకు సుపరిపాలన అందిస్తామన్నారు.
ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 'ప్రజల ఆమోదం లేని ఏకగ్రీవాలను ఉపేక్షించేది లేదు. 2,274 ఏకగ్రీవాలు చేశారు. ఏం అభివృద్ధి చేశారని ఏకగ్రీవాలు చేయాలని అడుగుతారు? వైసీపీ అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా ఉందా? టీడీపీ పాలనలో అనేక రంగాల్లో రాష్ట్రాన్ని నంబర్ 1గా నిలిపాం' అని చంద్రబాబు అన్నారు.
'మేము 25 వేల కిలోమీటర్ల రోడ్లు వేస్తే వైసీపీ ఎన్ని కిలోమీటర్ల రోడ్లు వేసింది? ఏం అభివృద్ధి చేశారని ఏకగ్రీవాలు కావాలి మీకు? వైసీపీ చెబుతోన్న ఏకగ్రీవాలు ప్రజల ఆమోదంతో జరిగేవి కాదు. దౌర్జన్యాలు, దాడులతో భయపెట్టి బలవంతపు ఏకగ్రీవాలు చేస్తున్నారు' అని చంద్రబాబు అన్నారు.
'ప్రజల ఆమోదం లేని ఈ తరహా ఏకగ్రీవాలు వద్దు. గ్రామాల్లో ఏదైనా అన్యాయం జరిగితే బయటకు రాకుండా చేయాలని ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారా? ఇటీవల పులివెందులలో ఓ మహిళను చంపితే వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు కూడా అనుమతి ఇవ్వలేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా మరిన్ని చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారా?' అని చంద్రబాబు ప్రశ్నించారు.
ఇలాగే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారా? ఇలా చేస్తే చివరకు నష్టపోయేది వైసీపీయే. ఏకగ్రీవాలను ఎలా చేస్తున్నారు? మాచర్ల ఘటన మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలి. అక్కడ ఏం జరిగిందో చూశాం. తెనాలిలో జరిగిన సంఘటన మళ్లీ జరగకుండా ఉండాలి. తెనాలిలో ఏం జరిగింది? ఓ ఇంట్లో మద్యం సీసాలు పెట్టి, అక్కడి అభ్యర్థిపై ఆరోపణలు మోపుతూ అరెస్టు చేయడానికి వెళ్లారు. అయితే, ఆయన ఇంట్లో సీసీకెమెరా ఉండడంతో వైసీపీ కుట్ర బయటపడింది' అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.