Olympics: ఒలింపిక్స్​ ను రద్దు చేయం.. విజయవంతంగా నిర్వహిస్తాం: అంతర్జాతీయ ఒలింపిక్స్​ కమిటీ ప్రెసిడెంట్​

IOC fully committed to hosting Tokyo Olympics successfully

  • షెడ్యూల్ ప్రకారమే మొదలవుతాయన్న థామస్ బాక్
  • ఎన్ని సవాళ్లు ఎదురైనా ముందుకే వెళతామని స్పష్టీకరణ
  • క్రీడాకారులకు వ్యాక్సిన్ వేయించేందుకు చర్చిస్తున్నామని వెల్లడి

టోక్యో ఒలింపిక్స్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ విజయవంతం చేస్తామని ఒలింపిక్స్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాక్ చెప్పారు. జపాన్ రాజధాని టోక్యోలో ముందే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఒలింపిక్స్ మొదలవుతాయన్నారు. జులై 23 నుంచి ఒలింపిక్స్, ఆగస్టు 24 నుంచి పారాలింపిక్ గేమ్స్ ప్రారంభమవుతాయని వివరించారు. బుధవారం ఆయన ఒలింపిక్స్ కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న 206 జాతీయ ఒలింపిక్ కమిటీలు, అన్ని అంతర్జాతీయ సమాఖ్యలు, క్రీడాకారులు ఒలింపిక్స్ నిర్వహించేందుకు దన్నుగా ఉన్నారని చెప్పారు. జపాన్ ప్రభుత్వం కూడా అందుకు కావాల్సిన సహకారమందిస్తోందని తెలిపారు. ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ, జపనీస్ ఒలింపిక్ కమిటీలూ మద్దతునిస్తున్నాయని చెప్పారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఒలింపిక్స్ నిర్వహణ సవాలుతో కూడుకున్నదేనని థామస్ అన్నారు. అందులోనూ చరిత్రలో ఎన్నడూ లేనంతగా మొదటి సారి వాయిదా వేసిన ఒలింపిక్స్ ను నిర్వహించడమన్నది మరిన్ని సవాళ్లతో కూడుకున్నదని చెప్పారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఏ దేశంలో పరిస్థితి ఎలా ఉందో ఎవరికీ తెలియదని, దీంతో ఒలింపిక్స్ ను రద్దు చేస్తారన్న ప్రచారం జరుగుతోందని అన్నారు.

ఇలాంటి ఊహాగానాల వల్ల ఆటగాళ్ల మానసిక స్థైర్యం, సంసిద్ధత దెబ్బతింటాయని చెప్పారు. ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఒలింపిక్స్ ను కచ్చితంగా విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి క్రీడాకారుడికీ కరోనా వ్యాక్సిన్ వేయించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో), వాటి తయారీదారులతో చర్చిస్తున్నామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News