Chittoor District: అచ్యుతానందగిరి స్వామి దారుణ హత్య.. ఆమె శిష్యురాలిపై అత్యాచార యత్నం!

  • ఆశ్రమంలోనే మట్టుబెట్టిన దుండగుడు
  • భూ వివాదమే కారణమని అనుమానం
  • స్వామి పార్థివ దేహానికి నేడు అంత్యక్రియలు
  • ఘటనా స్థలంలో లభించిన పర్సు
Atchyutananda Giri Swamy murderd

చిత్తూరు జిల్లాలోని శ్రీ రామతీర్థ సేవాశ్రమ నిర్వాహకుడు అచ్యుతానందగిరి స్వామి దారుణ హత్యకు గురయ్యారు. ఆయన వయసు 65 సంవత్సరాలు. జిల్లాలోని ఐరాల మండలం గుండ్లపల్లె సమీపంలో ఉన్న ఆశ్రమంలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి ఆయనను దారుణంగా హతమార్చాడు.

పోలీసుల కథనం ప్రకారం.. శ్రీరామతీర్థ సేవాశ్రమం 50 ఏళ్లుగా ఉంది. శాంతానంద స్వామి దీనిని నిర్వహించేవారు. 30 ఏళ్ల క్రితం అరగొండ పైమాఘం గ్రామానికి చెందిన పూర్ణచంద్రారెడ్డి అలియాస్ అచ్యుతానందగిరి స్వామి ఆయన వద్ద శిష్యుడిగా చేరారు. శాంతానంద స్వామి మరణానంతరం అచ్యుతానందగిరి ఆశ్రమ బాధ్యతలు చేపట్టారు.

అచ్యుతానంద స్వామి వద్ద పాకాల మండలానికి చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు శిష్యురాలిగా ఉంటున్నారు. ఆశ్రమంలో ప్రస్తుతం వీరిద్దరే ఉంటున్నారు. మంగళవారం రాత్రి భోజనాల అనంతరం వీరిరువురు ఎవరి గదుల్లోకి వారు వెళ్లిపోయారు.

అయితే, ఆ తర్వాత కాసేపటికే స్వామి గది నుంచి శబ్దాలు రావడంతో వెళ్లిన వృద్ధురాలు అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి హతాశురాలైంది. స్వామీజీ కాళ్లు, చేతులు కొట్టుకుంటూ కనిపించారు. చీకటిగా ఉండడంతో పరిసరాలను గాలించిన ఆమెపై అక్కడే మాటువేసిన దుండగుడు అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో వదిలేసి కిందపడి కొట్టుకుంటున్న స్వామీజీ గొంతు నులిమి చంపేశాడు.

అది చూసి వృద్ధురాలు భయంతో పక్కనే ఉన్న మామిడి తోటలోకి వెళ్లి దాక్కుంది. రాత్రంతా అక్కడే ఉన్న ఆమె ఉదయం వచ్చి చూడగా స్వామీజీ చనిపోయి కనిపించారు. విషయాన్ని ఆమె ఓ శిష్యుడికి చేరవేయడంతో గ్రామం మొత్తం పాకిపోయింది. ఆశ్రమానికి చేరుకున్న భక్తులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు జాగిలాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జాగిలాలు పీలేరు దిశగా వెళ్లినట్టు చెప్పారు. స్వామి పార్థివ దేహానికి నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, ఘటనా స్థలానికి కొద్ది దూరంలో ఓ పర్సును గుర్తించిన స్థానికులు దానిని పోలీసులకు అందించారు. అందులో ఏటీఎం కార్డు, ఫొటోలు, ఫోన్ నంబర్లు ఉన్నాయి. దర్యాప్తులో ఈ పర్సు కీలకంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మరోవైపు, ఈ హత్యకు భూ వివాదమే కారణమని తెలుస్తోంది. స్వామీజీ ఇటీవల పూతలపట్టు మండలం మిట్టూరు వద్ద ఓ ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసినట్టు ఆయన అన్నయ్య శ్రీరాములు తెలిపారు. అయితే, స్థలాన్ని విక్రయించిన వ్యక్తి దానిని అప్పగించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. బహుశా అతడే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు.

More Telugu News