KCR: ఒంటిమామిడి మార్కెట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కేసీఆర్.. రైతులతో మాటామంతి!

  • మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు సాగుచేయాలని రైతులకు సూచన
  • రైతుల నుంచి 4 శాతానికి మించి కమిషన్ తీసుకోవద్దని ఏజెంట్లకు ఆదేశం
  • కోల్డ్ స్టోరేజీలు, మౌలిక సదుపాయాల కల్పనకు 50 ఎకరాలు
Telangana CM KCR Visits Vantimamidi Market Yard

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సిద్దిపేటలోని ఒంటిమామిడి వ్యవసాయ, కూరగాయల మార్కెట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. పంటలసాగు, పెట్టుబడి వ్యయం, దిగుబడులు, మార్కెటింగ్ సౌకర్యం వంటి విషయాల గురించి ఆరా తీశారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని ఈ సందర్భంగా రైతులకు కేసీఆర్ సూచించారు. శాస్త్రీయ విధానంలో పంటలను సాగుచేస్తే వ్యవసాయం, కూరగాయల సాగు లాభసాటిగా మారుతుందని పేర్కొన్నారు. కూరగాయల రైతుల నుంచి నాలుగు శాతానికి మించి కమిషన్ తీసుకోవద్దని ఈ సందర్భంగా ఏజెంట్లను ఆదేశించారు.

కోల్ట్ స్టోరేజీల నిర్మాణంతోపాటు ప్రాథమిక సదుపాయాల కల్పన కోసం 50 ఎకరాల స్థలాన్ని గుర్తించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే, భవిష్యత్ అవసరాల కోసం ఒంటిమామిడి మార్కెట్‌ యార్డును మరో 14 ఎకరాల మేర విస్తరిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలకు ఒంటిమామిడి మార్కెట్ నుంచి కూరగాయలు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ అధికారులను కేసీఆర్ ఆదేశించారు.

More Telugu News