Sourav Ganguly: కార్డియాక్ చెకప్ కోసమే గంగూలీ ఆసుపత్రికి వచ్చారు: కోల్ కతా అపోలో ఆసుపత్రి వివరణ
- గంగూలీకి మళ్లీ గుండెపోటు అంటూ వార్తలు
- గంగూలీకి ఆరోగ్యం నిలకడగానే ఉందన్న అపోలో
- అన్ని పరీక్షలు నార్మల్ అని వెల్లడి
- ఇది రొటీన్ చెకప్ అంటున్న సన్నిహితులు
క్రికెట్ లెజెండ్, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (48) ఛాతీనొప్పితో కోల్ కతా అపోలో ఆసుపత్రిలో చేరాడంటూ ఈ మధ్యాహ్నం మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో కోల్ కతా అపోలో ఆసుపత్రి వర్గాలు గంగూలీ ఆరోగ్యంపై బులెటిన్ విడుదల చేశాయి. గంగూలీ తన గుండె ఆరోగ్య పరిస్థితిపై పరీక్షలు చేయించుకోవడానికి తమ ఆసుపత్రికి వచ్చాడని ఆ బులెటిన్ లో వెల్లడించారు. గంగూలీకి కార్డియాక్ చెకప్ నిర్వహించామని అతని కీలక అవయవాల పనితీరు సవ్యంగానే ఉందని, బీపీ, షుగర్ అన్నీ నిలకడగానే ఉన్నాయని వివరించారు.
గంగూలీ ఇటీవల గుండెనొప్పితో బాధపడగా, కోల్ కతాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఏంజియోప్లాస్టీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో, ఇవాళ ఆయన అపోలో ఆసుపత్రికి వెళ్లడం మీడియాలో మరోరకంగా ప్రచారం జరిగింది. ఆయనకు మరోసారి ఛాతీనొప్పి వచ్చిందని కథనాలు వచ్చాయి. దీనిపై గంగూలీ సన్నిహిత వర్గాలు స్పందిస్తూ, ఆందోళన చెందాల్సిందేమీ లేదని, ఇది సాధారణ చెకప్ మాత్రమేనని తెలిపాయి.