Bopparaju: ఏపీ ఉద్యోగ సంఘాల మధ్య విభేదాలు... వెంకట్రామిరెడ్డిపై బొప్పరాజు ధ్వజం

  • కిందిస్థాయి ఉద్యోగులను చులకనగా చూస్తాడని ఆరోపణ
  • సచివాలయానికి వెళితే కించపరిచేలా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం
  • ఆరోపణలను ఖండించిన వెంకట్రామిరెడ్డి
  • క్యాలెండర్లు అంటించవద్దన్నందుకు ఆరోపణలు చేస్తున్నాడని వెల్లడి
Differences between AP Employs unions

నిన్నమొన్నటి దాకా పంచాయతీ ఎన్నికలు వద్దంటూ తీవ్రస్థాయిలో మీడియాకెక్కిన ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు! ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఏపీ అమరావతి ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడుతున్నారు. తాము సచివాలయానికి వెళ్లినప్పుడు వెంకట్రామిరెడ్డి దారుణంగా ప్రవర్తిస్తున్నారని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. వెంకట్రామిరెడ్డికి, కిందిస్థాయి ఉద్యోగులకు అసలు సంబంధాలే లేవని అన్నారు.

"వెంకట్రామిరెడ్డి వైఖరి సరిగాలేదు. ఆయన చర్యలు ప్రజల్లో చులకనయ్యే విధంగా ఉన్నాయి. ఉద్యోగ సమాఖ్య చైర్మన్ హోదాలో హుందాగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఇతర సంఘాల నాయకులను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ అమరావతి జేఏసీ పక్షాన ఏకగ్రీవంగా తీర్మానం చేశాం" అని వెల్లడించారు.

ఇక తనపై వచ్చిన ఆరోపణల పట్ల వెంకట్రామిరెడ్డి బదులిచ్చారు. ఏపీ అమరావతి ఉద్యోగుల సంఘానికి, తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇటీవల బొప్పరాజు తన మనుషులతో కలిసి సచివాలయానికి వచ్చి అక్కడి గోడలపై క్యాలెండర్లు అతికిస్తుంటే తాము అభ్యంతర పెట్టామని వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. "సెక్రటేరియట్ అందిరిదీ... ఇక్కడ ఇలాంటివి అతికించవద్దని కోరాం. అన్ని సంఘాల వాళ్లు వచ్చి అతికిస్తుంటే గోడలు పాడైపోతాయని తెలిపాం. మేమే ఎలాంటి క్యాలెండర్లు అంటించబోము, అలాంటిది బొప్పరాజు అతికిస్తుంటే ఎలా అనుమతిస్తాం?" అని వ్యాఖ్యానించారు.

More Telugu News