Bandi Sanjay: ఇంత దారుణమైన, అతి తక్కువ ఫిట్ మెంట్ ను సమైక్య పాలకులు కూడా ఇవ్వలేదు: బండి సంజయ్
- తెలంగాణలో పీఆర్సీ నివేదిక విడుదల
- ఉద్యోగులకు 7.5 శాతం ఫిట్ మెంట్
- సమైక్య రాష్ట్రంలోనే 25 శాతానికి ఎప్పుడూ తగ్గలేదన్న సంజయ్
- 43 శాతం ఇవ్వాల్సిందేనని స్పష్టీకరణ
పీఆర్సీ నివేదికను తెలంగాణ సర్కారు ఇవాళ విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల మూలవేతనంపై 7.5 శాతం ఫిట్ మెంట్ ను మాత్రమే సిఫారసు చేయడం పట్ల మండిపడ్డారు. ఇంత దారుణమైన, అతి తక్కువ ఫిట్ మెంట్ ను సమైక్య పాలకులు కూడా ఇవ్వలేదని విమర్శించారు. సమైక్య రాష్ట్రంలో 25 శాతం కంటే తక్కువ ఫిట్ మెంట్ ఎప్పుడూ ఇవ్వలేదని వెల్లడించారు.
ఉద్యోగులకు ఫిట్ మెంట్ పేరుతో కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపాడని తెలిపారు. ఇప్పుడిస్తా, అప్పుడిస్తానంటూ ఊరించి, మూడేళ్ల తర్వాత బిశ్వాల్ కమిటీ నివేదికతో ఉసూరుమనిపించాడని వ్యాఖ్యానించారు. 7.5 శాతం ఫిట్ మెంట్ ఇవ్వడానికి మూడేళ్ల సమయం తీసుకోవాలా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. అసలు బిశ్వాల్ కమిటీని స్వతంత్రంగా పనిచేయనిచ్చారా? లేదా? అంటూ సందేహం వెలిబుచ్చారు. ఫాంహౌస్ లో కూర్చుని పీఆర్సీ నివేదిక రాయించావా కేసీఆర్? అంటూ అనుమానం వ్యక్తం చేశారు.
పీఆర్సీ వేసిన వెంటనే ఐఆర్ ఇవ్వడం సంప్రదాయం అని, ఈ సర్కారు ఐఆర్ ఇవ్వలేదని ఆరోపించారు. ఇంటి అద్దెలు పెరుగుతుంటే హెచ్ఆర్ఏ తగ్గించాలనుకోవడం మూర్ఖత్వం కిందకే వస్తుందని తెలిపారు. ఉద్యోగులు 31 నెలల నుంచి ఎదురుచూస్తుంటే వాళ్లకు ఇచ్చేది ఇదా? అంటూ సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు డిమాండ్ చేసిన మేరకు 43 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని స్పష్టం చేశారు.