Axiom Space: అంతరిక్ష ప్రయాణం.. ఒక్కొక్కరి చార్జీ రూ.400 కోట్లు!
- అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పనిచేసే తొలి ప్రైవేట్ సిబ్బంది ఖరారు
- నలుగురి పేర్లను ప్రకటించిన యాక్సియం స్పేస్ సంస్థ
- వచ్చే ఏడాది జనవరిలో ప్రయాణం
- ఐఎస్ఎస్ లో 8 రోజులు మకాం
చాన్స్ రావాలేగానీ.. వినువీధులకు చల్లని వెన్నెలల్నిచ్చే చందమామనైనా అందుకోవాలనుకుంటాం. చుక్కల్లో చంద్రుడిలా తేలిపోవాలనుకుంటాం. అయినా.. అలా వెళ్లాలంటే రాసి పెట్టి ఉండాలని ఓ నిట్టూర్పు విడుస్తాం. కానీ, జాబిల్లి దగ్గరికి కాకపోయినా అంతరిక్షంలో విహరించే అవకాశం రావొచ్చు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో అడుగు పెట్టొచ్చు. కొన్ని రోజులు అక్కడ గడిపి రావొచ్చు.
అక్షరాలా ప్రైవేటు వ్యక్తులూ అక్కడికి వెళ్లొచ్చు. అయితే, ఆ అవకాశమూ డబ్బున్నవారికే దక్కుతుంది. అవును మరి, అక్కడికి వెళ్లాలంటే వందల కోట్లు ముట్టజెప్పాల్సిందే. మంగళవారం దీనికి సంబంధించి, అంతరిక్ష కేంద్రానికి వెళ్లే తొలి ప్రైవేటు సిబ్బందిని యాక్సియం స్పేస్ అనే సంస్థ ప్రకటించింది. నలుగురు ప్రైవేటు వ్యక్తులను ఎంపిక చేసింది. ఒక్కొక్కరు తమ ‘సీట్’ కోసం 5.5 కోట్ల డాలర్లు (సుమారు రూ.400 కోట్లు) చెల్లించారు. వచ్చే ఏడాది జనవరిలో వారు స్పేస్ ఎక్స్ రాకెట్ లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళతారు.
నాసా మాజీ ఆస్ట్రోనాట్, యాక్సియం స్పేస్ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ లోపెజ్ అల్జీరియా ఆ టూర్ కు నేతృత్వం వహిస్తారు. ఆయనతో పాటు అమెరికాకు చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారి లారీ కానర్, కెనడాకు చెందిన వ్యాపారి మార్క్ పాథీ, ఇజ్రాయెల్ వ్యాపారవేత్త ఐటన్ స్టిబ్బీలు స్పేస్ స్టేషన్ కు వెళ్లనున్నారు. దాదాపు 8 రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉండి ప్రయోగాల్లో పాలుపంచుకుంటారు.
అయితే, వారిని అంతరిక్షంలోకి పంపించడానికి ముందు 15 వారాల పాటు అత్యంత కఠినమైన శిక్షణను ఇవ్వనున్నారు. అన్ని వైద్య పరీక్షలు పాసయ్యాకే వారు అంతరిక్ష ప్రయాణం చేసేలా అనుమతినివ్వనున్నారు. కాగా, 70 ఏళ్ల కానర్.. ఈ జర్నీతో స్పేస్ లో ప్రయాణించే రెండో వృద్ధ వ్యక్తిగా రికార్డులకు ఎక్కనున్నారు. అంతకుముందు 1998లో 77 ఏళ్ల జాన్ గ్లెన్ స్పేస్ ప్రయాణం చేశారు.
కాగా, హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ కూడా స్పేస్ కు వెళతారని గత ఏడాది నాసా వెల్లడించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఓ సినిమా తీసేందుకు ఆయన ఆసక్తి చూపిస్తున్నారంటూ నాసా అధికారి ధ్రువీకరించారు కూడా. దీంతో టామ్ పేరును యాక్సియం కూడా ప్రకటిస్తుందని అనుకున్నారు. కానీ, అది జరగలేదు. దీనిపై స్పందించేందుకు సంస్థ నిరాకరించింది.