Farmer Protestors: ఇండస్ సరిహద్దు నుంచి నటుడు దీప్ సిద్ధూను తరిమికొట్టిన రైతులు!

Protesters Angry Over Actor Deep Sidhu

  • రైతులను రెచ్చగొట్టిన దీప్ సిద్ధూ
  • ట్రాక్టర్లను ఎర్రకోట వద్దకు తీసుకెళ్లిన వైనం
  • అక్కడ ఫేస్ బుక్ లో లైవ్
  • అరెస్ట్ తప్పదంటున్న పోలీసులు

నిన్న న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన ఘటనల వెనుక నటుడు, గాయకుడు దీప్ సిద్ధూ ఉన్నాడని, ఆయనే ట్రాక్టర్ ర్యాలీని ఎర్రకోట వైపు మళ్లించాడని ఆరోపిస్తున్న రైతు నిరసనకారులు, ఆయన్ను ఇండస్ సరిహద్దు నుంచి తరిమికొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, చిత్రాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ట్రాక్టర్ ర్యాలీని కేవలం ఢిల్లీ సరిహద్దుల మీదుగా తీసుకెళతామని హామీ ఇస్తూ, రైతు సంఘాలు అనుమతి తీసుకోగా, నిన్న పరిస్థితి మరోలా మారిపోయిన సంగతి తెలిసిందే.

ఇందుకు దీప్ సిద్ధూ ప్రసంగాలే కారణమని, ఆయన స్వయంగా ముందు కదులుతూ రైతులను రెచ్చగొట్టారని రైతు సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. అతను రైతుల ప్రతినిధి కాదని, అసలు రైతు కూడా కాదని అంటున్న నేతలు, ఉద్యమం పక్కదారి పట్టడానికి ఆయనే కారణమని మండిపడ్డారు. నిన్న అల్లర్లు ప్రారంభం కాగానే దీప్ సిద్ధూతో రైతులు వాగ్వాదానికి దిగారని, ఢిల్లీలోకి ట్రాక్టర్లను ఎందుకు దారి తీయించావని రైతులు అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేకపోయారని తెలుస్తోంది.

ఆపై ఈ ఉదయం రైతుల నుంచి ఆయనకు తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. రైతుల ఆగ్రహాన్ని తట్టుకోలేక పోయిన ఆయన, తన వాహనంలో సరిహద్దులను వదిలి పారిపోయారు. ఇండస్ సరిహద్దుల నుంచి ఆయన వాహనం వెళుతుంటే, దానిపై కర్రలు, చెప్పులు విసరడం కనిపించింది. కాగా, నిన్న జరిగిన అల్లర్ల కేసులో ఇప్పటికే పోలీసులు 15 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. దీప్ సిద్ధూను సాధ్యమైనంత త్వరలో అదుపులోకి తీసుకుని విచారిస్తామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

ఎర్రకోటపై తమ జెండాను ఎగురవేసిన తరువాత, సిద్ధూ ఫేస్ బుక్ ద్వారా లైవ్ లోకి వచ్చి, ఆ దృశ్యాలను చూపిస్తూ, రైతులను మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో దీప్ సిద్ధూ అక్కడే ఉన్నారనడానికి సాక్ష్యాలు లభించడంతో, ఈ కేసులో ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తోందని, అరెస్ట్ తప్పదని తెలుస్తోంది. ఎర్ర కోట వద్ద నుంచి దీప్ చేసిన ఫేస్ బుక్ లైవ్ వీడియోను మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News