Corona Virus: కరోనాపై పోరాడిన వాళ్లే టీకా వద్దంటే ఎలా?: నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్

  • టీకా తీసుకునేందుకు నిరాకరిస్తున్న వైద్యులు
  • రెండు టీకాలూ పూర్తి సురక్షితమన్న డాక్టర్ వీకే పాల్
  • సంకోచించకుండా తీసుకోవాలని విజ్ఞప్తి
Doctors Should Take Vaccine Asks Niti Aayog

ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్ లపై పూర్తి స్థాయిలో అనుమానాలు నివృత్తి కాకపోవడంతో పలువురు డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్లు టీకా తీసుకునేందుకు సుముఖంగా లేకపోవడంపై కేంద్రం స్పందించింది. డాక్టర్లు, నర్సులు, మహమ్మారిపై పోరాడిన అన్ని వర్గాలు వ్యాక్సిన్ తీసుకునేందుకు సంకోచించరాదని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ కోరారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, టీకా భద్రతపై ఎటువంటి సందేహాలు వద్దని, చిన్న చిన్న రియాక్షన్స్ రావడం అత్యంత సహజమని ఆయన అన్నారు.  "కరోనాకు టీకాను తయారు చేసేందుకు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. మన హెల్త్ కేర్ వర్కర్లు... ముఖ్యంగా వైద్యులు, నర్సులు దీన్ని నిరాకరిస్తున్నారు. ఇది చాలా బాధాకరం. ఈ మహమ్మారి ఎంత పెద్దదో, ప్రపంచాన్ని ఎక్కడి వరకూ తీసుకుని వెళుతుందో ఇప్పటికీ అంచనాలు లేవు. కాబట్టి దయచేసి వ్యాక్సిన్ వేయించుకోండి" అని ఆయన అన్నారు.

ఏవైనా తీవ్ర దుష్పరిణామాలు తలెత్తినా, వాటిని ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని,  అందుకు ఏర్పాట్లు జరిగాయని ఆయన అన్నారు. ఇండియాలో పంచుతున్న రెండు వ్యాక్సిన్ లూ సురక్షితమేనని తెలిపారు. హెల్త్ కేర్ వర్కర్లు ముందుగా వ్యాక్సిన్ తీసుకుని, మిగతా వారికి రోల్ మోడల్ గా నిలవాలని అభిలషించిన ఆయన, కరోనాను పూర్తిగా అదుపు చేసేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమన్న నిజాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించాలని కోరారు.

కాగా, ఇండియాలో వ్యాక్సిన్ పంపిణీ మొదలై 10 రోజులు దాటినా, చాలా రాష్ట్రాలు ఇంకా తమ లక్ష్యాలను చేరుకోలేకపోతున్నాయి. నిన్న వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎవరూ తీవ్ర అనారోగ్యం బారిన పడలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

More Telugu News