BJP: మమత బెనర్జీ నోట ఇస్లామిక్ ప్రార్థన... వీడియోను విడుదల చేస్తూ విమర్శించిన బీజేపీ!
- నేతాజీ జయంతి వేడుకల్లో రాముని నినాదాలు
- ఆగ్రహంతో ప్రసంగించకుండా వెళ్లిపోయిన మమత
- పాత వీడియోలో అల్లా ప్రార్థనలు చేసిన మమత
- మతాల మధ్య చిచ్చు పెట్టేదెవరో తెలుసుకోవాలన్న బీజేపీ
నాలుగు రోజుల క్రితం కోల్ కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో తాను ప్రసంగించే సమయానికి కొందరు 'జై శ్రీరామ్' నినాదాలు చేయడంతో, ముఖ్యమంత్రి మమత బెనర్జీ తీవ్ర అసహనానికి లోనై, ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మాట్లాడకుండానే వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇదేమీ రాజకీయ వేదిక కాదని, తనను పిలిచి ఇలా అవమానించడం తగదని కూడా ఆమె వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు తాజాగా ఓ వీడియోను విడుదల చేశాయి.
గతంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె నోటి నుంచి ఇస్లాం మత ప్రార్థన వచ్చింది. 'లా ఇలాహ ఇల్లెల్లా...' అంటూ ఆమె ప్రసంగించారు. అదే వీడియోను తాజాగా షేర్ చేసిన బీజేపీ, దానితో పాటే ఈ నెల 23న నేతాజీ 123వ జయంతి ఉత్సవాల నాడు జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను జత చేస్తూ, ప్రశ్నల వర్షం కురిపించారు. మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నది ఎవరో ఈ వీడియోను చూస్తే, తెలుస్తుందని, హిందూ మతం మీద మమతకు గౌరవం లేదని కూడా అర్థమవుతుందని బెంగాల్ బీజేపీ విభాగం మండిపడింది. "ఇస్లామిక్ పదాలను స్వాగతించిన మీకు జై శ్రీరామ్ అంటే పట్టదా? ఎంత వెర్రితనం మమతాజీ?" అంటూ ప్రశ్నించింది.
మమత తన చేష్టలతో కోట్లాది మంది ఇలవేల్పుగా ఉన్న శ్రీరాముడిని అవమానించారని బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గీయ విమర్శలు గుప్పించారు. ప్రధాని పక్కన ఉన్నారని తెలిసే, ఆమె సభను రాజకీయం చేశారని, రానున్న ఎన్నికల్లో లబ్దిని పొందడమే ఆమె ఉద్దేశమని ఆరోపించారు.
ఇదే విషయమై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ, బీజేపీ ఎవరినీ జై శ్రీరామ్ అనాలని ఒత్తిడి చేయబోదని, మమత బెనర్జీ ఇలా నిరసన తెలియజేయడం సరికాదని అన్నారు. ఇది రామ దేశమని, ప్రతి ఒక్కరూ రాముని మనుషులేనని వ్యాఖ్యానించిన ఆయన, భారత స్వాతంత్ర్య సంగ్రామాన్ని ప్రారంభించిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన మమత శ్రీరాముడిని ద్వేషించబోరనే భావిస్తున్నట్టు తెలిపారు.