Farmer: ఢిల్లీలో ఐటీవో వద్ద రైతు మృతి... పోలీసులే కాల్చారంటున్న రైతులు.. కాదంటున్న పోలీసులు!

  • ఢిల్లీలో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు
  • పోలీసుల బుల్లెట్ తగిలి రైతు మరణించాడని రైతుల వాదన
  • ట్రాక్టర్ పైనుంచి పడి చనిపోయాడంటున్న పోలీసులు
  • సమస్యాత్మక ప్రాంతాల్లో మెట్రో స్టేషన్ల మూసివేత
  • కీలక ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న పోలీసులు
Farmer died in protests

ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మక రూపు దాల్చింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో రైతుల నిరసనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఢిల్లీ ఐటీవో వద్ద ఆందోళనకారులే పోలీసులను తరిమికొట్టడం వీడియోల్లో కనిపించింది.

ఈ క్రమంలో ఢిల్లీ ఐటీవో వద్ద ఓ రైతు మృతి చెందడం రైతుల్లో ఆగ్రహావేశాలు కలిగిస్తోంది. పోలీసుల బుల్లెట్ తగిలి రైతు మరణించాడని ఇతర రైతులు ఆరోపిస్తున్నారు. అయితే రైతుల ఆరోపణలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. ట్రాక్టర్ పైనుంచి కిందపడి చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు.

కాగా, ఢిల్లీ ఐటీవో వద్ద ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు నగరంలోని సమస్యాత్మక ప్రాంతాల్లోని మెట్రో స్టేషన్లను మూసివేయించారు. రైతుల ఆందోళన మరింత ఉద్ధృతమవుతుందన్న అంచనాల నేపథ్యంలో విజయ్ చౌక్, పార్లమెంట్ భవన్, నార్త్ సౌత్ బ్లాక్ ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు. సాధారణ ప్రజలు, పర్యాటకులు వెళ్లిపోవాలని పోలీసులు, భద్రతా సిబ్బంది హెచ్చరించారు.

More Telugu News