Venkatram Reddy: ఎస్ఈసీతో మేమెప్పుడూ విభేదించలేదు: ఉద్యోగ సమాఖ్య నేత వెంకట్రామిరెడ్డి
- పంచాయతీ ఎన్నికలు జరపాలన్న సుప్రీంకోర్టు
- స్పందించిన ఏపీ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్
- తమకు న్యాయం జరగలేదని వెల్లడి
- అయితే సుప్రీం తీర్పును గౌరవిస్తామని వివరణ
పంచాయతీ ఎన్నికలు జరపాలంటూ సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకట్రామిరెడ్డి స్పందించారు. ఎన్నికల సంఘం తమను వివాదంలోకి లాగిందని, ప్రభుత్వ ఉద్యోగులతో వైరం మంచిది కాదని వ్యాఖ్యానించారు. ఎస్ఈసీతో తామెప్పుడూ విభేదించలేదని స్పష్టం చేశారు. తాము ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని ఎక్కడా చెప్పలేదని, ఉద్యోగులను ఇబ్బందిపెట్టవద్దని మాత్రమే కోరామని వివరించారు.
తమ వాదనలు వినకుండానే కోర్టు నిర్ణయం తీసుకుందని అన్నారు. ఈ అంశంలో తమకు న్యాయం జరగలేదని భావిస్తున్నామని, అయితే సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. సీఎస్ ను కలిసి తమ ఇబ్బందులు చెప్పుకుంటామని, 50 ఏళ్లు దాటిన మహిళా ఉద్యోగులకు పోలింగ్ విధులు కేటాయించవద్దని కోరతామని అన్నారు. ఎన్నికల విధుల్లో కరోనాతో మరణిస్తే రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.