Riyaz: అన్నా రాంబాబుపై పోటీకి పవన్ అవసరం లేదు.... వెంగయ్యనాయుడు భార్య చాలు: జనసేన ప్రకాశం జిల్లా ఇన్చార్జి

Jansena Prakasam district incharge challenges Anna Rambabu

  • గిద్దలూరులో జనసైనికుడు వెంగయ్యనాయుడు ఆత్మహత్య
  • అన్నా రాంబాబు బెదిరింపులే కారణమని జనసేన ఆరోపణ
  • ఎస్పీకి ఫిర్యాదు చేసిన పవన్ కల్యాణ్
  • దమ్ముంటే పవన్ తనపై పోటీ చేసి గెలవాలన్న అన్నా

ప్రకాశం జిల్లాలో ఇటీవల వెంగయ్యనాయుడు అనే జనసేన కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గిద్దలూరు శాసనసభ్యుడు అన్నా రాంబాబుపై పవన్ కల్యాణ్ జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. తాము తలుచుకుంటే అన్నా రాంబాబును పాతాళానికి తొక్కేస్తాం అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై అన్నా రాంబాబు బదులిస్తూ, తాను రాజీనామా చేసి వస్తానని, పవన్ తనపై పోటీ చేసే గెలిచే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ఇన్చార్జి రియాజ్ బదులిచ్చారు.

అన్నా రాంబాబుపై పోటీ చేయడానికి తమ అధినేత పవన్ కల్యాణ్ అవసరంలేదని, ఇటీవల మృతి చెందిన వెంగయ్య నాయుడు భార్యను పోటీ చేసి గెలిపించుకోగలమని అన్నారు. పవన్ కల్యాణ్ పై అన్నా రాంబాబు అవాకులు చెవాకులు పేలుతున్నాడని మండిపడ్డారు. "పవన్ ను పోటీ చేయమని అడిగే స్థాయి మీకుందా? మీ బెదిరింపులకు ఆత్మహత్య చేసుకున్న వెంగయ్య నాయుడు భార్యను మీపై పోటీకి దింపి గెలిపించుకుని తీరుతాం... ఇది జనసేన పార్టీ మీకు విసురుతున్న సవాలు. మీరు రాజీనామా చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి.

ఒకవేళ మీరు రాజీనామా చేసినా మీకు గిద్దలూరు టికెట్ ఇవ్వడానికి వైసీపీ సిద్ధంగా లేదు. 2009లో మీరు ప్రజారాజ్యంలో ఉన్నారు... ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనమయ్యేసరికి రోశయ్య భజన చేశారు. ఆ తర్వాత టీడీపీలో చేరి చంద్రబాబు భజన చేసి జగన్ పైనా విమర్శలు చేశారు. ఆ తర్వాత వైసీపీలో చేరి జగన్ మా నాయకుడు అంటున్నారు. 2024 ఎన్నికలు వచ్చేసరికి మీరు ఏ పార్టీలో ఉంటారో కూడా తెలియదు... అదీ మీ చరిత్ర" అని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News