Supreme Court: ఏపీ పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత!

  • పంచాయతీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్ల కొట్టివేత
  • ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలని ధర్మాసనం తీర్పు
  • ఉద్యోగ సంఘాలపై సుప్రీం ఆగ్రహం
  • పనిచేయకుండా పిటిషన్లు వేయడం ఏంటని అసంతృప్తి
Suprem Court dismiss petition on AP Panchayat elections

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పంచాయతీ ఎన్నికల వాయిదా కుదరదని, ఏపీలో స్థానిక ఎన్నికలు యథావిధిగా జరపాలని సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరించింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వాయిదా కోరుతూ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ సంజయ్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్ ధర్మాసనం కొట్టివేసింది.

ఏపీ సర్కారు తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోందని, పోలీసులు వ్యాక్సిన్ భద్రతా విధుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. గోవాతో పాటు అనేక రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కారణంగా స్థానిక ఎన్నికలు వాయిదా వేశారని వివరించారు.

దీనిపై ద్విసభ్య ధర్మాసనం స్పందిస్తూ... దేశంలో ఎక్కడా ఎన్నికలు జరగడం లేదా..? ఏపీలోనే ఎందుకు నిలిపివేయాలని కోరుతున్నారు? అంటూ ప్రశ్నించింది. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న సమయంలో ఎన్నికలు కావాలని కోరి, వైరస్ ప్రభావం తగ్గినవేళ ఇప్పుడెందుకు వద్దంటున్నారు? అంటూ నిలదీసింది.

ఏదో ఒక సాకుతో ఎన్నికలు నిలిపివేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఎస్ఈసీపై మీ రాతలే మీ అభిప్రాయాలను, మీ ఆలోచనా తీరును తేటతెల్లం చేస్తున్నాయని పేర్కొంది. ఎన్నికల నిర్వహణ అనేది ఎన్నికల సంఘం ప్రధాన విధి అని, ఈ కార్యనిర్వహణలో కోర్టులను జోక్యం చేసుకోవాలని కోరడం సబబు కాదని జస్టిస్ సంజయ్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్ లతో కూడిన ధ్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా ధర్మాసనం ఉద్యోగ సంఘాల తీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగులు పనిచేయకుండా, పిటిషన్ వేయడం ప్రమాదకరమైన ధోరణి అని ఆందోళన వెలిబుచ్చింది. ఉద్యోగుల ప్రవర్తన పూర్తి అసంతృప్తికరంగా ఉందని, ఎన్జీవోలు చట్టానికి వ్యతిరేకమన్న భావన కనిపిస్తోందని అభిప్రాయపడింది.

ఇక ఏపీ పంచాయతీ ఎన్నికల వ్యవహారం సుప్రీంకు చేరడానికి ముందు అనేక పరిణామాలు జరిగాయి. ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీనిపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించగా, ఎన్నికలు వద్దంటూ సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది.

అయితే ఎస్ఈసీ దీనిపై హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించగా, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ ఎన్నికలు జరపొచ్చంటూ ద్విసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ ఉద్యోగ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ ను కూడా హైకోర్టు కొట్టివేసింది.

ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో అసంతృప్తికి లోనైన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దానికితోడు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం, ఏపీఎన్జీవోలు, కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. వ్యాక్సినేషన్ వేళ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని, విధులతో పాటు తమ ప్రాణాలు కూడా ముఖ్యమేనని తమ పిటిషన్లలో పేర్కొన్నారు.

అదే సమయంలో... పంచాయతీ ఎన్నికలపై నిర్ణయం తీసుకునేముందు తమ వాదనను కూడా పరిగణనలోకి తీసుకోవాలంటూ ఎస్ఈసీ సుప్రీంలో కేవియట్ దాఖలు చేశారు. పంచాయతీ ఎన్నికలపై ఎవరు పిటిషన్ వేసినా తమ వాదనను కూడా వినాలని కేవియట్ ద్వారా కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

వాస్తవానికి ఈ పిటిషన్లు తొలుత జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం ముందుకు వచ్చాయి. అయితే ఉద్యోగ సంఘాల తరఫు న్యాయవాది విజ్ఞప్తి మేరకు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ధర్మాసనాన్ని మార్చారు. ఈ పిటిషన్ల విచారణ బాధ్యతను జస్టిస్ సంజయ్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్ ధర్మాసనానికి అప్పగించారు.

తాజా తీర్పుతో ఏపీ పంచాయతీ ఎన్నికలకు అడ్డంకులు తొలగినట్టయింది. ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయిన దరిమిలా ఇక నామినేషన్ల ప్రక్రియ ఊపందుకోనుంది.

More Telugu News