Shikhar Dhawan: వారణాసిలో పక్షులకు ఆహారం వేసిన శిఖర్ ధావన్.. చిక్కుల్లో బోటు యజమాని

  • వారణాసిలో పర్యటించిన శిఖర్ ధావన్
  • బోటు విహారం చేస్తూ పక్షులకు మేత
  • బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ఇలాంటి చర్యలు నిషిద్ధమన్న మేజిస్ట్రేట్
  • బోటు యజమాని నిబంధనలు ఉల్లంఘించాడని వెల్లడి
  • పర్యాటకులకు ఈ విషయంలో అవగాహన ఉండకపోవచ్చని వివరణ
Boat owner in troubles after Team India cricketer Shikhar Dhavan fed birds

టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ వారణాసి పర్యటనలో సరదాగా బోటుపై విహరిస్తూ పక్షులకు ఆహారం వేస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. ఈ ఫొటోలను శిఖర్ ధావన్ ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నాడు. పక్షులకు మేత తినిపించడం ఎంతో సంతోషదాయకం అని ధావన్ పేర్కొన్నాడు. ధావన్ సంతోషం ఏమో కానీ, ధావన్ ఎక్కిన ఆ బోటు యజమాని మాత్రం చిక్కుల్లో పడ్డాడు.

దీనిపై వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ (కలెక్టరు) కౌశల్ రాజ్ శర్మ బోటు యజమానిపై చర్యలకు ఉపక్రమించారు. దేశంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఉన్న తరుణంలో పక్షులకు ఆహారం వేసేందుకు పర్యాటకులను బోటుపైకి అనుమతించడం ఏంటని మేజిస్ట్రేట్ ప్రశ్నించారు. ఇందులో పర్యాటకులపై ఎలాంటి చర్యలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. వారణాసిలో విహారయాత్రలకు బోట్లు నడిపే కొందరు వ్యక్తులు మార్గదర్శకాలను పాటించడంలేదని తమకు సమాచారం ఉందని, వారి బోట్లపై టూరిస్టులు పక్షులకు ఆహారం వేస్తున్నారని మేజిస్ట్రేట్ వివరించారు.  

ఇలాంటి అంశాలపై పర్యాటకులకు ఏమంత అవగాహన ఉండకపోవచ్చని, అందుకే నిబంధనలు ఉల్లంఘిస్తున్న బోటు యజమానులను గుర్తిస్తున్నామని వెల్లడించారు. కాగా, దేశంలో బర్డ్ ఫ్లూ మరింత విస్తరిస్తోంది. మధ్యప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, చత్తీస్ గఢ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం కనిపిస్తోంది.

More Telugu News