sikkim: భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ.. 20 మంది చైనా సైనికులకు గాయాలు
- సిక్కిం సరిహద్దుల వద్ద ఘటన
- భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు చైనా సైనికుల యత్నం
- చర్యలను తిప్పికొట్టిన భారత జవాన్లు
- నలుగురు భారత సైనికులకూ గాయాలు
ఓ వైపు చర్చలు జరుపుతూనే మరోవైపు సరిహద్దుల వద్ద బలగాలను పెంచుతోన్న చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతూనే ఉంది. మరోసారి సరిహద్దులు దాటి భారత్‌లోకి ప్రవేశించేందుకు చైనా సైనికులు ప్రయత్నించారు. గతవారం జరిగిన ఈ ఘటన గురించి మీడియాకు ఆలస్యంగా సమాచారం అందింది.
చైనా సైనికుల చొరబాటును గుర్తించిన భారత జవాన్లు వెంటనే స్పందించి, దీటుగా వారి ప్రయత్నాలను తిప్పికొట్టారు. ఉత్తర సిక్కింలోని నాకూ లాలో సరిహద్దుల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. భారత జవాన్ల ధాటికి 20 మంది చైనా సైనికులు గాయపడినట్లు సమాచారం.
అలాగే, నలుగురు భారత జవాన్లకూ గాయాలయినట్లు తెలిసింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిక్కింలోని ఇదే ప్రాంతంలో 2020, మే9న కూడా చైనా దుందుడుకు చర్యలకు పాల్పడగా భారత సైన్యం వారిని తరిమికొట్టింది. అప్పట్లోనూ ఇరు దేశాల సైనికులు గాయపడ్డారు.